సూర్యాపేట సిటీ, మే 18 : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు తప్పకుండా ఎన్నికల నియమావళిని పాటించాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల నియమ నిబంధనల పరిధి దాటకుండా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుందని.. ర్యాలీలు, సభలు, సమావేశాలకు సంబంధిత అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
ప్రసంగాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయవద్దని పేర్కొన్నారు. ముందస్తు అనుమతి లేకుండా ఇతరుల ఇండ్ల గోడలపై రాతలు రాయడం, హోర్డింగులు ఏర్పాటు చేయడం వంటివి చేయవద్దని సూచించారు. సోషల్ మీడియాలో ఇతరులను కించపరిచేలా పోస్టులు పెట్టరాదని పేర్కొన్నారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.