నల్లగొండ, మార్చి 22 : మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక మార్చాలని జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం రీసెర్చి డైరెక్టర్ పి.రఘురాంరెడ్డి, విశ్వ విద్యాలయం ఎక్స్టెన్షన్ డైరెక్టర్ వి.సుధారాణి, పాలెం పరిశోధన కేంద్రం ఏడీఆర్ ఎం.మల్లారెడ్డి రైతులకు సూచించారు. నల్లగొండ కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం, పాలెం వ్యవసాయ పరిశోధనా కేంద్రం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన దక్షిణ తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా సంఘం సమావేశంలో వారు పాల్గొన్నారు.
2024- 25 సంవత్సరంలో వానకాలం, యాసంగి సీజన్లలో చేపట్టాల్సిన పరిశోధనలు, విస్తరణ అంశాల గురించి రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులతో చర్చిస్తూ రెండోరోజు ముగింపు సందర్భంగా పలు అంశాలుపై మాట్లాడారు. రైతులు సాగులో పంటల వైవిధ్యత, యాంత్రీకరణతో పంటల సాగుపై దృష్టిని సారించి కూలీల కొరతను అధిగమించే దిశగా చైతన్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు ఆ దిశగా పరిశోధనలు చేయాలని సూచించారు. 25 శాతం మంది పైచిలుకు రైతులు వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వచ్చే విస్తరణ సేవలను పొందుతున్నారని, పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు క్షేత్ర స్థాయిలో ప్రదర్శనలు నిర్వహించి అవగాహన కల్పించాలని తెలిపారు.
పరిశోధన ఫలితాలు ప్రతి రైతుకు అందించగలిగినప్పుడే ఉపయోగం ఉంటుందన్నారు. శాస్త్రవేత్తలు, విస్తరణాధికారులు మమేకమై వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరుస్తూ కొత్త పుంతలు తొక్కించాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పప్పు దినుసులు, నూనె గింజల పంటల విస్తీర్ణం పెంచేందుకు కృషి చేస్తున్నదని, రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు అవగాహన కలిగించాలని అన్నారు. ప్రతి సీజన్లో రైతుకు కావాల్సిన అవసరాలు తెలుసుకొని ఆ దిశగా ముందుకు సాగాలని, మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా పంటల సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
రాబోయే వానకాలంలో వేసే పంటల సాగుపై వ్యవసాయ శాస్త్రవేత్తలు పక్కా ప్రణాళికతో ఉండాలన్నారు. పాలెం పరిశోధన కేంద్రంలో చేస్తున్న పరిశోధన ఫలాలను డాక్టర్ ఎస్. వాణిశ్రీని, వాతావరణ పరిస్థితులపై డాక్టర్ లలితా రాణిని వివరించాలని కోరగా, వారు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆపత్కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. వ్యవసాయ స్థితిగతులు, ఎదురొంటున్న సమస్యలు తదితర అంశాలపై ఆయా జిల్లాల వ్యవసాయాధికారులు సమావేశంలో వివరించారు. రాబోయే వ్యవసాయ పరిశోధనలు, విస్తరణ అంశాలపై చర్చించారు.
అనంతరం డాక్టర్ సుధారాణి ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని వాటర్ ఫర్ పీస్ అనే వీడియోను ఆవిష్కరించారు. అదే విధంగా వ్యవసాయంలో నేటి ప్రాముఖ్యత, నీటి సంరక్షణ అనే అంశంపై డాక్టర్ అనిల్ కుమార్ వివరించారు. ఆ తర్వాత దక్షిణ తెలంగాణ మండల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులు, శాస్త్రవేత్తలను పదకొండు గ్రూపులుగా విభజించి పరిశోధన, విస్తరణ విభాగంలో పొందు పరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్, ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్లు డా. భరత్ భూషన్ రావు, లక్ష్మణ్, కేవీకే, పాలెం, కంపాసాగర్ కోఆర్డినేటర్లు ప్రభాకర్ రెడ్డి, సుల్లాన్, శ్రీనివాస్, లావణ్య, రమణారెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఆయా జిల్లాల అధికారులు, రైతులు పాల్గొన్నారు.