రామగిరి, జూలై 31 : మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టె క్నాలజీ కళాశాల అధికారుల అనాలోచిత వైఖరి విద్యార్థుల పాలిట శాపంగా మారిం ది. స్థానిక కళాశాలలో బీటెక్‌లో సీటు వచ్చిన విద్యార్థులు శనివారంలోగా సర్టిఫిట్లు సమర్పించి అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంది. అయితే యూనివర్సిటీలో సీటు వచ్చిన విద్యార్థులు నేరుగా అన్నెపర్తి వద్ద ఉన్న యూనివర్సిటీ క్యాంపస్‌కు వెళ్లారు. తీరా అక్కడికి వెళ్తే అడ్మిషన్లు యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న పానగల్లో తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో వారంతా అక్కడి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పానగల్‌కు వచ్చారు. తీరా అక్కడకు రాగానే అడ్మిషన్ దరఖాస్తు ఫారం ఇవ్వాలంటే ఎస్బీఐలో తీసిన రూ. 250లతో కూడిన చలానతో పాటు జనరల్ నెంబర్‌తో ఉన్న కాపీ సమర్పిస్తేనే కళాశాల అడ్మిషన్ దరఖాస్తు ఇస్తామంటూ చాలాన్ ఫారం విద్యార్థులకు అందచేశారు. దీంతో విద్యార్థులు మళ్లీ బ్యాంకు వద్దకు.. అక్కడి నుంచి పానగల్ కళాశాలకు రాకపోకలు చేపట్టడంతో రూ. 200లు, బ్యాంకు కమీషన్ చార్జీ రూ. 70 అదనంగా ఖర్చు వచ్చిందని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈవిషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ ఫోన్ లో ఎంజీయూ రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లగా అడ్మిషన్ల వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. అడ్మిషన్లు ప్రతి సంవత్సరం పానగల్ క్యాంపస్‌లో తీసుకుంటామని, యూనివర్సిటీ వెబ్సైట్ చూడాలన్నారు. నిత్యం యూనివర్సిటీకి వచ్చే విద్యార్థులు పరీక్ష ఫీజులు తదితరాలు చెల్లించాలంటే యూ నివర్సిటీ నుంచి సుమారు కిలోమీటరున్నర దూరంలో ఉన్న అన్నెపర్తి బెటాలియన్ సమీపంలో ఉన్న ఎస్బీఐ బ్రాంచీకి పరుగులు తీయాల్సిందే.
చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంలా యూనివర్సిటీ అధికారుల తీరు ఉంది. యూనివర్సిటీలో సీటు వచ్చిన విద్యార్థులు సర్టిఫికెట్లతో పానగల్లో కళాశాలకు వెళ్లి రిపోర్టు చేయాలని కళాశాల ప్రిన్సిపాల్ గురువారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుతోపాటు రూ. 250 చలానా చెల్లించాలని తెలిపారు. పూర్తి వివరాల కోసం అధ్యాపకులు డా.విజయ్‌కుమర్ 9490565566, వే ణుగోపాల్ 9640705745 సంప్రదించాలని కోరారు.