– చండూరు ఎంపీడీఓ బండారు యాదగిరి
చండూరు, మే 16 : వర్షపు నీరు వృథా కాకుండా ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలని చండూరు ఎంపీడీఓ బండారు యాదగిరి ప్రజలకు పిలుపునిచ్చారు. జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం కళాజాత బృందాల ద్వారా మండలంలోని బోడంగిపర్తి, తాస్కానిగూడెం, పుల్లెంల, ఇడికూడ, సిర్దేపల్లి గ్రామాలలో విస్తృతంగా ప్రచారం, అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. “భూగర్భ జలాల పెంపుదల, వర్షపు నీటిని సంరక్షించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. గ్రామాల్లోని ప్రతి ఇంటి పరిధిలోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ నీటి పొదుపు పద్ధతులను పాటించాలన్నారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతతో పాటు నీటి సంరక్షణపై పంచాయతీ పాలకవర్గాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు.
వేముల పుష్ప వీరేశం ఆధ్వర్యంలో కళాజాత బృందం గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభలలో తమ ఆట పాటలు, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ పద్ధతులు, ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బోడంగిపర్తి సర్పంచ్ బొమ్మల సుగుణమ్మ, తాస్కానిగూడెం సర్పంచ్ కొండా రజిత రవి, పుల్లెంల సర్పంచ్ ముక్కముల వెంకన్న, ఇడికూడా సర్పంచ్ పాల్వాయి రమాదేవి, సిర్దేపల్లి సర్పంచ్ దామెర రాములు, మండల ఉపాధి హామీ ఏపీఓ శ్రీనివాస్, డీఆర్డీఏ డీపీఎం సోమయ్య, ఏపీఎం యాదయ్య, ఎంపీఓ కోటయ్య, ఉప సర్పంచులు, ఉపాధి హామీ సిబ్బంది, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, స్వయం సహాయక సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

‘ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ఉద్యమంలా చేపట్టాలి’