నల్లగొండ సిటీ, మే 20 : మూడు సంవత్సరాల్లో ఎస్ఎల్బీసీ సొరంగం పనులను పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. మంగళవారం నల్లగొండ జిల్లా కనగల్ మండలం జి.ఎడవల్లి గ్రామంలో కోటి రూపాయల వ్యయంతో చేపట్టిన చెరువు మరమ్మతు పనులను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. జిల్లా రైతాంగం ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకునే విధంగా ప్రభుత్వం ప్రాజెక్టులు, రిజర్వాయర్లలను పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. దీనిలో భాగంగా జి.ఎడవల్లి చెరువు పనులతో పాటు ఇతర మరమ్మతుల గాను కోటి రూపాయలను డీఎంఎఫ్టీ ద్వారా మంజూరు చేయడం జరిగిందన్నారు. దాంతో పాటు రూ.4 వేల కోట్ల వ్యయంతో ఎస్ఎల్బీసీ సొరంగం పనులు చేపట్టడం జరిగిందన్నారు. అయితే అటువైపు నుంచి సొరంగం కూలిపోవడంతో పనులు ఆగిపోయాయని, అయినప్పటికీ తిరిగి ప్రారంభించి మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని తెలిపారు.
అదేవిధంగా రూ.4 కోట్ల వ్యయంతో గ్రామంలో 8 మందికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినట్లు చెప్పారు. అలాగే బీటీ రోడ్డు, డ్రైనేజీ పనులకు రూ.30 లక్షలు మంజూరు చేసామన్నారు. జిల్లా ఆస్పత్రి మాదిరిగానే కనగల్ హాస్పిటల్ లో గ్లూకోమా కంటి పరీక్షలకై అదునాతన యంత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మండల మహిళా సమాఖ్య సభ్యులకు ఐయిటిపాములలో ఉన్న మాదిరిగానే సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. ఉదయసముద్రం, బ్రాహ్మణ వెల్లంల తదితర ప్రాజెక్టు ద్వారా నీరు వృధా కాకుండా ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్తో పాటు పాటు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నీటి సద్వినియోగానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా ఎర్రవెల్లి చెరువు తూము గండి వల్ల నీరు వృధా అవుతుందని తెలుసుకుని, మరమ్మతులకు మంత్రి ఆదేశాలతో నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అధికారులు నిర్దేశించిన సమయంలో నాణ్యతతో పనులు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి రెవెన్యూ కలెక్టర్ నారాయణ అమిత్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నెహ్రూ, ఆర్డీఓ అశోక్ రెడ్డి, తాసీల్దార్ పద్మ పాల్గొన్నారు.