మిర్యాలగూడ, మే 15 : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో నిర్మిస్తున్న విజ్ఞాన కేంద్రం భవనంలో నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాములు నిర్వహించాలని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలోని తన నివాసంలో విజ్ఞాన కేంద్రం భవన నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూరు చేస్తూ ప్రోసిడింగ్స్ కాపీని మిర్యాలగూడ రెడ్డి సంక్షేమ సంఘం నాయకులకు ఆయన అందజేశారు. విజ్ఞాన కేంద్రం భవన నిర్మాణానికి గతంలోనూ రూ.50 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో భవనం స్లాబ్, గోడల నిర్మాణం చేపట్టారు. ఇంకా అసంపూర్తిగా ఉన్న భవనం పూర్తి కోసం మరో రూ.30 లక్షలు మంజూరు చేస్తూ ప్రొసీడింగ్ కాపీలను అందజేసి మాట్లాడారు.
విజ్ఞాన కేంద్రం భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసి మిర్యాలగూడ పరిధిలో ఉన్న నిరుద్యోగ యువతీయువకులకు, మహిళలు, రైతులకు నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు, ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించాలని సూచించారు. శిక్షణార్థులకు వసతి సౌకర్యం కూడా కల్పిస్తే మంచిగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్‌ను రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ రెడ్డి సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు కంచర్ల అనంతరెడ్డి, అధ్యక్షుడు అనుముల మధుసూదన్‌రెడ్డి, నాయకులు నూకల హనుమంతరెడ్డి, పాప చెన్నారెడ్డి, మన్యం బుచ్చిరెడ్డి, నామిరెడ్డి నరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, వెంకట్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, ఎర్రమాధ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.