పెన్‌పహాడ్, అక్టోబర్ 09 : చికెన్ తిని ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన పెన్‌పహాడ్ మండలం దూపాడు గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు కత్తి ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. గడిచిన శనివారం తన మనవడి 21వ రోజు వేడుక సందర్భంగా పెన్‌పహాడ్‌లోని క్వాలిటీ చికెన్ సెంటర్ వద్ద 6 కేజీల చికెన్ తీసుకుని వెళ్లాడు. భోజనం అనంతరం గంట తర్వాత కుటుంబ సభ్యులకు స్వల్పంగా వాంతులయ్యాయి. మామూలు వాంతులే అని పట్టించుకోలేదు. కాగా తెల్లవారుజాము నుండి విపరీతంగా వాంతులు, విరోచనాలు కాగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ముగ్గురు, ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారులను, మరో ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ మహిళను అడ్మిట్ చేశారు. డాక్టర్లు ఇచ్చిన రిపోర్టు ప్రకారం చికెన్ తినడం వల్లే అస్వస్థతకు గురైనట్లు బాధితుడు తెలిపాడు. చికెన్ సెంటర్ నిర్వాహకుడిని ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నట్లు వెల్లడించాడు. క్వాలిటీ చికెన్ సెంటర్‌పై అధికారులు చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలను రక్షించాలని ఈ సందర్భంగా ఉపేందర్ పేర్కొన్నాడు.