తాతముత్తాతల నుంచి ఆయనది వ్యవసాయ కుటుంబం. తనకున్న 10 ఎకరాల్లో వరి సాగు చేయడం వంశపారంపర్యంగా వస్తున్నది. 2021లో యాసంగి వరి సాగు పూర్తవడంతో ఖాళీగా ఉండలేక మార్కెట్లో ఆకాశన్నంటుతున్న బెండకాయల ధర ఆయనను కూరగాయల సాగు వైపు ప్రోత్సహించింది. ఎకరం భూమిలో ఏకంగా 12 టన్నుల బెండ దిగుబడితో రూ.2లక్షల ఆదాయాన్ని గడించాడు. దాంతో కూరగాయల సాగుపై మక్కువ పెరిగింది. ఈ నేపథ్యంలో తనకున్న బోరు, డ్రిప్ సహకారంతో మిర్చి, టమాట, దోస, చిక్కుడు, కాకర, బంతిపూలు, అంతరపంటగా క్యాబేజీ సాగుతో ఏడాదికి రూ.4 లక్షల ఆదాయాన్ని గడిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు నారమ్మగూడేనికి చెందిన రైతు లెంకల యుగంధర్‌రెడ్డి.
వరి సాగుకు భిన్నంగా వినూత్న ఆలోచనతో కూరగాయల సాగును చేపటి ఏడాదికి రూ.4లక్షల ఆదాయాన్ని గడిస్తున్నాడు. దశాబ్దాలుగా సాటి రైతుల తరహాలోనే వరి సాగు చేస్తూ వచ్చాడు. 2021 మార్చిలో యాసంగి పంట దిగుబడి పూర్తవడంతో ఖాళీగా ఉండలేక మార్కెట్లో బెండకాయకు భారీ డిమాండ్ ఉన్న దృష్ట్యా ఎకరంలో బోరు, డ్రిప్ సాయంతో బెండ సాగు ప్రారంభించాడు. 12 టన్నుల దిగుబడి సాధించడంతోపాటు రూ.2.50 లక్షలు చేతికొచ్చాయి. తాను పెట్టిన ఖర్చు పోను రూ.2 లక్షలు లాభం రావడంతో కూరగాయల సాగుపై మక్కువ పెరిగింది.
యూట్యూబ్ ను అనుసరిస్తూ..
సీజన్ వారీగా కూరగాయలకు ఉండే డిమాండ్ నేపథ్యంలోనే యూట్యూబ్‌ను అనుసరిస్తూ నాణ్యమైన విత్తనాల ఎంపిక మొదలు సాగు మెళకువలు పాటిస్తున్నాడు. ఒకసారి నాటిన మొక్కలు మూడు దఫాలుగా దిగుబడి వస్తుండటంతోపాటు వరి సాగు పెట్టుబడితో పోలిస్తే ఖర్చు తక్కువగా ఉండటం, తక్కువ నీటి వినియోగం, పంట కాలం 40 రోజులే కావడం కలిసి వస్తుంది. ఎకరా వరి సాగుకు దున్నడం, పురుగు మందులు, ఫర్టిలైజర్, కలుపు, కోతకు రూ.3ం వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుండగా.. కూరగాయలను ఒకసారి నాటడం, డీఏపీ మినహా తెగుళ్ల బెడద లేకపోవడం ఆదాయానికి కలిసివస్తున్న అంశంగా రైతు యుగంధర్‌రెడ్డి చెబుతున్నాడు. వేసవిలో శుభకార్యాలు ఇతరత్రా అవసరాల నేపథ్యంలో బంతిపూలకు ఉండే గిరాకీని దృష్టిలో పెట్టుకొని బంతి సాగు చేపట్టి కిలో రూ.100 విక్రయిస్తుండటం విశేషం. కూరగాయల సాగు లాభసాటిగా మారడంతో ఏటా రూ.5 లక్షల ఆదాయం లభిస్తున్న తీరుతో పెట్టుబడి ఖర్చులు రూ.లక్ష పోగా రూ.4 లక్షల నికర ఆదాయాన్ని పొందుతున్నాడు.
రెండెకరాల్లో కూరగాయల సాగు..
పదెకరాల్లో ఎనిమిదెకరాలను కౌలుకిచ్చాడు. మిగతా రెండెకరాల్లో రెండేండ్లుగా కూరగాయల సాగు చేస్తున్నాడు. స్టేకింగ్ పద్ధతిలో టమాట, కాకరతోపాటు మిర్చి, మల్చింగ్ విధానంలో దోస, చిక్కుడు, అంతరపంటగా క్యాబేజీ సాగు చేస్తున్నాడు. 50 రోజుల్లోనే దిగుబడి వస్తుండడంతోపాటు సీజన్‌కు అనుగుణంగా యూట్యూబ్ సాయంతో కూరగాయల సాగుకు ఉపక్రమించాడు. కూరగాయల సాగుతో లాభాలతోపాటు మార్కెట్లో డిమాండ్ ఉన్న కూరగాయలను ఆ సీజన్‌కు తగ్గ సమయంలో దిగుబడి వచ్చేట్టుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దాంతో ఒక్క సీజన్‌కు రూ.2.50 లక్షల ఆదాయం పొందుతున్నాడు. పెట్టుబడి రూ.50 వేలు పోగా రూ.2 లక్షలు మిగులుతుండడంతో పూర్తిస్థాయిలో కూరగాయల సాగును నమ్ముకుని వరి సాగుకు స్వస్తి పలికాడు.
ఖాళీ సమయం కూరగాయల సాగు వైపు మళ్లించింది
కూరగాయల సాగు ద్వారా ఏటా రూ.4 లక్షల నికర ఆదాయం వస్తున్నది. యాసంగి వరి సాగు అనంతరం ఖాళీ సమయం నన్ను కూరగాయల సాగువైపు మళ్లించింది. నాకున్న భూమిలోనే బోరు, డ్రిప్ సాయంతో మిర్చి, టమాట, కాకర, దోస, చిక్కుడు, బంతిపూలు, గోంగూర, సొరతోపాటు అంతరపంటగా క్యాబేజీ సాగు చేస్తున్నా. సీజన్ వారీగా డిమాండ్ ఉండే కూరగాయల సాగు ఎంపికచేయడంతోపాటు నాణ్యమైన విత్తనాలు వాడుతున్నా. కూరగాయల సాగుకు పర్యవేక్షణ అవసరం. మిర్యాలగూడలో సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటుండడంతో ధర కలిసి వస్తుంది. ఎలాంటి పురుగు మందులు వాడని కారణంగా మంచి డిమాండ్ ఉంటుంది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే కూరగాయల సాగును విస్తృతం చేస్తా.
-లెంకల యుగంధర్‌రెడ్డి, రైతు, నారమ్మగూడెం