Teachers | సూర్యాపేట అర్బన్, ఆగస్టు 25 : సూర్యాపేట జిల్లాలో సర్దుబాటు చేసిన ఉపాధ్యాయుల డిప్యూటేషన్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అసలే రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రస్తుతం మండల స్థాయిలో డిప్యూటేషన్లకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో మరింత సమస్యలు ఎదుర్కొంటున్నారు. జిల్లా అధికారుల తీరు, అనుభవరాహిత్యంతో తుంగతుర్తి నియోజకర్గంలో పని చేస్తున్న సుమారు 120 మందికి పైగా ఉపాధ్యాయులు వారానికి మూడు రోజులు ఒక పాఠశాలలో మరో మూడు రోజులు డిప్యూటేషన్ పాఠశాలలో పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాత్కాలిక పద్ధతిలో చేసిన సర్దుబాటు ద్వారా జరిగిన పాఠశాల డిప్యూటేషన్లతో రెండు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులతోపాటు అక్కడ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు సిలబస్ పూర్తి కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ జిల్లాలోని చాలా పాఠశాలల్లో అవసరానికి మించి ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ వారికి డిప్యూటేషన్ ఇవ్వకుండా సక్రమంగా నిర్వహణ జరుగుతున్న పాఠశాల నుంచి ఉపాధ్యాయులను పంపడం జిల్లా, మండల అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు.
కలెక్టర్ ఆదేశాలని హుకూం
జిల్లా పరిషత్ పాఠశాలల్లో పని చేస్తున్న పలువురు ఉపాధ్యాయులను మూడు రోజులు ఒక పాఠశాలలో మరో మూడు రోజులు ఇంకొక పాఠశాలలో పని చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటేషన్ల పేరుతో సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి, తిరుమలగిరితోపాటు ఇతర మండలాల్లో సర్దుబాటు చేశారు. ఈ సమయంలలో మహిళా ఉపాధ్యాయులకు వెసులుబాటు కల్పించాలి కానీ ఉన్నతాధికారులు ఇష్టానుసారం చేయడంతో వారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనీసం ముందుగా సమాచారం ఇవ్వకుండా ఇది కలెక్టర్ ఆదేశాలని, తప్పనిసరిగా పాటించాలని, లేకుంటే సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. జిల్లాలో అధికంగా ఉన్న ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై పంపకుండా తక్కువగా ఉన్న పాఠశాల నుంచి డిప్యూటేషన్లు ఇవ్వడంతో సమస్యలను జిల్లా అధికారులే సష్టిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
అడ్మినిస్ట్రేషన్‌పై ప్రభావం
డిప్యూటేషన్ తీసుకున్న ఉపాధ్యాయులు ఇద్దరు హెడ్మాస్టర్ల కింద పని చేయడంతో వారి ఆదేశాలు పాటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉపాధ్యాయులు సెలవు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఇద్దరు హెడ్మాస్టర్ల పర్మిషన్ తీసుకుంటున్నారు. డిప్యూటేషన్ ఇచ్చే సమయంలో కనీసం ఉపాధ్యాయుల అభిప్రాయాలు తీసుకోకుండా జిల్లా అధికారులు ఇష్టారాజ్యంగా పాఠశాలలను కేటాయిస్తున్నట్లు తెలుస్తున్నది. డిప్యూటేషన్‌పై రెండు పోస్టులు ఉన్న ఉపాధ్యాయులను పంపాలి కాని, అధికారులు ఆ నిబంధనను పట్టించుకోలేదని ఉపాధ్యాయ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా అధికారుల అనాలోచిత నిర్ణయం
జిల్లా అధికారులు అనాలోచిత నిర్ణయంతో ఉపాధ్యాయులపై ఒత్తిడి పెరుగడంతోపాటు ఉపాధ్యాయులకు సిలబస్ రెండు చోట్లా పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వారం బోధించాల్సిన సిలబస్ మూడు రోజుల్లో పూర్తి చేయాల్సి వస్తుంది. దీంతో ఇటు విద్యార్థులు, అటు ఉపాధ్యాయులపై భారం పడుతున్నది. విద్యార్థులకు ఇచ్చిన హోమ్ వర్క్ క్షణ్ణంగా పరిశీలించి తప్పొప్పులను కూడా సరిచేసే పరిస్థితి లేకపోవడంతో ఎఫ్ఏ -1పై ప్రభావం పడుతుంది. ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు ఉపాధ్యాయులను పంపడం మూలంగా ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో విద్యార్థుల చదువుపై అస్తవ్యస్తంగా మారింది.
జిల్లా ప్రాతిపదికన సర్దుబాటు చేయాలి
అధికారులు జిల్లాలో ఉపాధ్యాయులు అధికంగా ఉన్న పాఠశాలలను గుర్తించి అక్కడి నుంచి డిప్యూటేషన్ చేస్తే ప్రయోజనం ఉంటుంది. కానీ మండల ప్రాతిపదికన సర్దుబాటు చేస్తున్నారు.దీంత ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఇబ్బంది కలుగుతున్నది. కలెక్టర్ దీనిపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో ఉపాధ్యాయుల తరపున సమస్యల పరిష్కారానికి మా సంఘం సిద్ధంగా ఉంటుంది.
-రేపాక లింగయ్య, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు