హాలియా, నవంబర్ 14: హాలియా మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ‘మాకు సబ్బుల బిల్లులు ఇప్పించండి సార్..’ అంటూ అరిచి గీపెట్టినా 12 నెలలుగా వారి సంక్షేమాన్ని పట్టించుకునేవారే లేరు. చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లుగా తమ పరిస్థితి ఉందని మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులు వాపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హాలియా మున్సిపాలిటీలో 58 మంది పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు. వీరికి నెలసరి వేతనంతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణ కోసం నాలుగు సబ్బులు (రెండు వంటి సబ్బులు, రెండు బట్టల సబ్బులు), కొబ్బరి నూనె డబ్బా, కేజీ బెల్లం తదితర వస్తువుల కొనుగోలుకు బిల్లు ఇవ్వాలి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పారిశుధ్య కార్మికులకు నెలసరి వేతనం, సబ్బుల బిల్లులతో పాటు ఏటా దసరా పండుగకు రెండు జతల యూనిఫాం ఇచ్చేవారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం 12 నెలలుగా తమకు సబ్బుల బిల్లు, రెండు జతల యూనిఫాం అందడం లేదని కార్మికులు వాపోతున్నారు. గతంలో పేరుకుపోయిన పెండింగ్ బిల్లులోని కొంత మొత్తం ఆరు మాసాల క్రితం ఇచ్చారే తప్ప సబ్బుల బిల్లు పూర్తిగా చెల్లించ లేదని పేర్కొంటున్నారు.
శ్రమ ఎక్కువ.. వేతనం తక్కువగా ఉందని, చాలీచాలని వేతనంతో అర్ధాకలితో పస్తులుండే తమకు సబ్బులు, కొబ్బరినూనె, బెల్లం తదితరాలు కొనుగోలు చేసుకునే స్థోమత లేక ఇబ్బంది పడుతున్నామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తే ప్రస్తుత ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ పాలకవర్గం కాలపరిమితి గత ఏడాది ముగిసిపోవడంతో అధికారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని కార్మిక సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు స్పందించి తమకు సబ్బు ల బిల్లు, రెండు జతల యూనిఫాం అందేలా చర్యలు చేపట్టాలని కార్మికులు కోరుతున్నారు.
ఏడాది కాలంగా హాలియా మున్సిపాలిటీకి పాలకవర్గం లేకపోవడంతో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పారిశుధ్య కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. ఇది సరికాదు. పారిశుధ్య కార్మికులు లేకుంటే పరిశుభ్రత లోపిస్తుంది. కార్మికుల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. పెండింగ్ బిల్లులు చెల్లించాలి.
-నల్లగొండ సుధాకర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్
హాలియా మున్సిపాలిటీకి నేను రాకముందు పారిశుధ్య కార్మికులకు సబ్బుల బిల్లు, 2 జతల యూనిపాం పెండింగ్ ఉన్న మాటవాస్తమే. నేను బాధ్యతలు తీసుకున్న తరువాత పెండింగ్ బిల్లులన్నీ చెల్లించాం. త్వరలో మిగతా బిల్లులు చెల్లిస్తాం.
– రామదుర్గారెడ్డి, మున్సిపల్ కమిషనర్