నల్లగొండ ప్రతినిధి, జూన్ 24(నమస్తే తెలంగాణ): మీరు దశాబ్దాలుగా ఓటు వేస్తున్నారా? ఇంకా మా ఓటును ఎవరూ చోరీ చేయలేరు అనే ధీమాలో ఉన్నారా? అయినా సరే ఇప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే మీ ఓటు గల్లంతు కావడం ఖాయం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న సర్ ప్రక్రియ అత్యంత కీలకంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా క్రమబద్ధీకరణ అంతా 2002 నాటి ఓటరు లిస్టు ఆధారంగానే జరుగుతుంది.
ఈ నేపథ్యంలో అసలు మ్యాపింగ్ అంటే ఏమిటీ? ఎవరికి ఏ మ్యాపింగ్ వర్తిస్తుంది? ముఖ్యంగా పళ్లై అత్తగారింటికి వచ్చిన మహిళలు, కొత్తగా ఓటు హకు పొందిన యువత ఏం చేయాలి? అన్న వివరాలపైనే ఈ కథనం. ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి తప్పనిసరిగా మారింది. గురువారం నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదలయ్యే ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (సర్)లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా మీ ఓటు గల్లంతయ్యే ప్రమాదం ఉంది.
ప్రతీ ఓటరు ఓటు భద్రంగా ఉండాలంటే విధిగా బూత్ లెవల్ అధికారి(బీఎల్ఓ)లు ఇచ్చే ఎన్యుమరేషన్ ఫారం తప్పనిసరిగా పూర్తి చేసి సకాలంలో అందించాల్సిందే. బీఎల్ఓలు ఇంటికి వచ్చినప్పుడు వారు అడిగే వివరాలన్నీ ఇస్తేనే ఓటు భద్రంగా ఉంటుంది. లేదంటే ఓటును కోల్పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా తప్పుల్లేని ఓటర్ల జాబితా రూపకల్పన పేరుతో ఎన్నికల సంఘం రాష్ట్రంలోనూ సర్ కార్యక్రమం చేపడుతుంది. అందులో భాగంగా నేటి నుంచి వచ్చే నెల 24వ తేదీ వరకు ప్రతీ ఓటరు ఇంటిని బీఎల్ఓలు సందర్శిస్తూ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పూర్తి చేస్తారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను సేకరించడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఉమ్మడి జిల్లాలోని 12 శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని బీఎల్ఓలకు ఆయా నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో శిక్షణ పూర్తి చేశారు. నల్లగొండ జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 566 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బూత్ లెవల్ అధికారులకు ఆయా మండల కేంద్రాల్లో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన బీఎల్ఓలకు సర్‌కు అవసరమైన ఎన్యుమరేషన్ ఫారాలు, సంబంధిత బుక్, పెన్ను, పెన్సిల్ వంటి వస్తువులతో కూడిన బ్యాగులు అందజేశారు. దీంతో బీఎల్వోలు తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ఇళ్లల్లో ఉంటున్న ఓటర్ల వివరాలు సేకరించనున్నారు.
నిర్లక్ష్యంగా ఉంటే అంతే సంగతులు..
ఓటు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం లాంటిది. సర్ మ్యాపింగ్ ప్రక్రియ కేవలం ప్రభుత్వ సర్వే మాత్రమే కాదు మీ భవిష్యత్తు రాజకీయ, సంక్షేమ హకులను నిర్ణయించే ప్రాధాన్యత గల అంశం. ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో సర్‌తో లక్షలాది ఓట్లు గల్లంతయ్యాయి. దీంతో ఎన్నికల సర్వేలకు భిన్నంగా పలు రాష్ట్రాల్లో అధికార పీఠాలే కదిలిపోయాయి. బీజేపీ యేతర ప్రభుత్వాలు కూలిపోయి చాలా చోట్ల బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయన్న విషయం తెలిసిందే. దీంతో సర్ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఓట్లు గల్లంతు కావడమే కాదూ రానున్న రోజుల్లో జరిగే ఎన్నికల్లోనూ భిన్న ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
అందుకే సర్‌పై రాష్ట్రంలో ముఖ్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్తో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా అప్రమత్తమయ్యాయి. రెండు పార్టీలు కూడా రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు సర్‌పై పార్టీ నేతలకు, కార్యకర్తలకు, బూత్ స్థాయి ఏజెంట్లకు సైతం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. సర్‌లో పార్టీల ప్రతినిధులుగా ఏం చేయాలో విపులంగా వివరించి అప్రమత్తం చేశాయి. ప్రభుత్వం పంపించే బీఎల్ఓల వెంట తప్పనిసరిగా పార్టీల బీఎల్ఏలు ఉండాల్సిందేనని కూడా ఆదేశాలిచ్చాయి. ఈ నేపధ్యంలో గురువారం నుంచి మొదలు కానున్న సర్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.
2002 ఓటరు జాబితా ప్రామాణికం..
బీఎల్ఓలు ఇంటింటిని సందర్శించి ఓటరు వివరాలు సేకరించి 2025 ఓటరు జాబితాను 2002 నాటి ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుని సవరించనున్నారు. 2025 ఓటరు జాబితాలో పేరు ఉండి 2002లో జాబితాలో లేకుంటే అందుకు కారణాలు తెలుసుకుంటారు. ప్రామాణిక ఓటరు జాబితా 2002 నాటికి జన్మించని వారిని గుర్తించి వారి పేరును జాబితాలో కొనసాగిస్తారు. అయితే 2002 ఓటరు జాబితాలో పేరు లేని ఓటర్లు మాత్రం తమ తల్లిదండ్రుల ఓటరు వివరాలు, గుర్తింపు ఆధారంగా మ్యాపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
సదరు ఓటరు తన తల్లిదండ్రుల నియోజకవర్గ పోలింగ్ కేంద్రం, జాబితాలో సీరియల్ నంంబర్ తదితర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. కొత్తగా ఓటు నమోదైన ప్రతి ఓటరు తమ తల్లిదండ్రుల ఓటరు జాబితా వివరాలను అందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాల్లో నమోదైన నకిలీ ఓటర్లను, మరణించిన వారి ఓటరు వివరాలను గుర్తించి జాబితా నుంచి తొలగిస్తారు. అయితే 2002 నాటి ఓటరు జాబితాను ప్రభుత్వం ప్రతీ తాసీల్దార్ కార్యాలయం నుంచి గ్రామాల్లోని బీఎల్ఓలకు ఇప్పటికే పంపిణీ చేసింది. మీరు పుట్టిన ఊరు లేదా ప్రస్తుత నివాసం ఉంటున్న ప్రాంతాల్లోని బీఎల్ఓలను సంప్రదిస్తే నాటి ఓటరు జాబితా లభిస్తుంది. అందుకనే ప్రతి ఒకరూ ఓటు హకును కోల్పోకుండా ఉండాలంటే 2002 ఓటరు లిస్టులోని తమ పేరు లేదా తమ తల్లిదండ్రుల ఓటరు సీరియల్ నంబర్ తెలుసుకుని ఉండాలి.
పుట్టింటితోనే అత్తగారింటి ఓటు భద్రం
2002 తర్వాత వివాహమై పుట్టిన ఊరిని వదిలి అత్తగారి ఊరికి వచ్చిన మహిళల పేర్లు ప్రస్తుతం వారి పుట్టింటి ఊరిలోని 2002 లిస్టులో ఉండవు. అలాంటి వారు ఓటుహక్కు కోల్పోకుండా ఉండాలంటే పుట్టిన ఊరిలోని 2002 ఓటరు లిస్టులో తల్లిదండ్రుల పేరు, ఓటరు జాబితాలోని వారి సీరియల్ నంబర్ తెలుసుకుని ఉండాలి. ఆ సీరియల్ నంబర్ ఆధారంగా ప్రస్తుతం నివాసముంటున్న ఊరిలోని బీఎల్ఓలు మ్యాపింగ్ చేసి మీ ఓటును సురక్షితం చేస్తారు.
ప్రతి ఓటరుకు రెండు ఫారాలు
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో ఇంటింటికి వచ్చే బీఎల్ఓలు ప్రతి ఓటరుకు రెండు ఎన్యుమరేషన్ ఫారాలు అందిస్తారు. అందుకు ఓటరు నుంచి తగిన ఎకనాలెడ్జ్మెంట్ సైతం తీసుకుంటారు. ఈ రెండు ఫార్లా అడిగిన వివరాలను ఓటరు స్వయంగా నమోదు చేసి ఒకటి బీఎల్ఓకు, మరొకటి తన వద్దే భద్రపరుచుకోవాల్సి ఉంటుంది. ఇంటింటి వివరాలు సేకరించడానికి బీఎల్ఓలకు ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం నెలరోజుల వ్యవధి ఇచ్చింది. అయితే ఈ లోపు ఎన్యుమరేషన్ ఫారాలు పూర్తి చేయడానికి అవసరమైన వివరాలు సేకరించి దగ్గర పెట్టుకుంటే ఇంటింటి సర్వేకు వచ్చే బీఎల్ఓలకు సులభంగా ఉంటుంది.
స్వగ్రామాలకు వెళ్లాల్సిందే
వ్యాపార, ఉద్యోగ, ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు ఈ నెల రోజుల్లో విధిగా స్వగ్రామాలకు వచ్చి ప్రత్యేక సమగ్ర సవరణ కోసం వివరాలు అందించడం తప్పనిసరి. ఈ నెల రోజుల్లో వీలు కాని వారు దీనిపై అభ్యంతరాల స్వీకరణకు ఇచ్చిన గడువు జులై 31 నుంచి ఆగస్టు 30 మధ్యలో అధికారుల వద్దకు స్వయంగా వెళ్లి తమ వివరాలను నమోదు చేయించుకునే అవకాశం ఉంది. అభ్యంతరాల పరిష్కారం అనంతరం తుది సమగ్ర ఓటర్ల జాబితాను ఈ ఏడాది అక్టోబర్ ఒకటో తేదీన ప్రకటించనున్నారు.
నేటి నుంచి జూలై 25 నాటికి బీఎల్వోలు తమ పరిధిలోని ఓటర్ల పూర్తి వివరాలు అధికారులకు నిర్దేశిత ఫార్మెట్లో అందిస్తారు. అయితే సర్వేలో భాగంగా బీఎల్వోలు ప్రతి ఇంటిలోని ఓటర్లందరికీ రెండు ఎన్యుమరేషన్ ఫారాలు అందించి రసీదు తీసుకుంటారు. అక్షరాస్యులైన ఓటర్లు ఈ ఫారాలను స్వయంగా నింపి సంతకం చేసి ఒకటి బీఎల్ఓకు అందించాల్సి ఉంటుంది. రెండవది ఓటరు తన వద్దే భద్రపరుచుకోవాలి. దీనికి నెల రోజులు గడువు ఉంటుంది. బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లే క్రమంలో ఏదైనా ఇంటికి తాళం వేసి ఉంటే ఆ ఇంటిని నెల రోజుల్లో మూడు సార్లు విధిగా సందర్శించాల్సి ఉంటుంది. అయినా సరే ఓటరు అందుబాటులోకి రాకపోతే డోర్‌లాక్ కింద వదిలేస్తారు. ఇక క్షేత్రస్థాయిలో ప్రతీ పది మంది బీఎల్ఓల పనితీరును పర్యవేక్షించేందుకు ఒక సూపర్వైజర్ను నియమించారు.
మూడు రకాల మ్యాపింగ్..
సాధారణ ఓటరు సవరణ మాదిరిగా కాకుండా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) భిన్నమైన పద్ధతిలో చేపడతారు. ఇందులో మ్యాపింగ్ ప్రక్రియ అనేది కీలకం కాగా మూడు రకాల మ్యాపింగ్ ప్రక్రియలు ఉన్నాయి. ఓటరు ప్రస్తుత నివాసాన్ని బట్టి ఏ కేటగిరి కిందికి వస్తారో అన్నది తెలుసుకోవాలి.
సెల్ఫ్ మ్యాపింగ్
2002 సమగ్ర ఓటరు జాబితాలో పేరు ఉండి ప్రస్తుత 2025 ఓటరు లిస్టులోనూ ఓటరుగా నమోదై ఉంటే వారు నేరుగా బీఎల్ఓలు ఇంటికి వచ్చినప్పుడు లేదా వాళ్ల వద్దకు వెళ్లినప్పుడు సెల్ఫ్ మ్యాపింగ్ చేయమని కోరాలి. అయితే ఇందులో 2002లో ఒక చోట నివాసం ఉండి ప్రస్తుతం మరోచోట నివాసం ఉంటున్న ఓటర్లు సెల్ఫ్ మ్యాపింగ్ పరిధిలోకి వస్తారు. 2002 ఓటరు లిస్టులో పేరు ఉండి, ప్రస్తుతం నివాసం ఉన్న చోట కూడా పేరు ఉందన్న ధీమాతో సెల్ఫ్ మ్యాపింగ్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఓటు కోల్పోయే ప్రమాదం ఉంది.
యాడ్ ప్రోజెనీ
కొందరికీ 2002 నాటికి 18 ఏళ్లు నిండకపోవడంతో ఓటు హక్కు రాదు… కానీ ప్రస్తుతం 2025 ఓటరు లిస్టులో ఓటు ఉంటుంది. ఇలాంటి వారు అప్పట్లో తమకు ఓటు హక్కు రానందున ఇప్పుడు మ్యాపింగ్ అవసరం లేదనుకుంటే పొరపాటే. ప్రస్తుతం మ్యాపింగ్‌లో ఓటుహకు కోల్పోవడం ఖాయం. అందుకుని 2002 ఓటరు లిస్టులో రక్తసంబంధీకుల సీరియల్ నంబర్ ఆధారంగా ప్రస్తుత ఓటరు యాడ్ ప్రోజెనీ చేయించాల్సి ఉంటుంది.
సెల్ఫ్ ప్రోజెనీ
2002 నాటికి 18 ఏళ్లు నిండినా ఏదైనా కారణంతో 2002 నాటి ఓటరు లిస్టులో పేరు లేకపోతే ఓటరు పూర్వీకులైన తల్లిదండ్రులు, సోదరులు, తాతలు తదతర కుటుంబ సభ్యుల పేర్లు 2002 నాటి ఓటరు జాబితాలో ఉంటే ఆ లింకుతో సెల్ఫ్ ప్రోజెనీ చేయించుకోవాలి. సర్ ప్రమాదం నుంచి మీ ఓటు హకును కాపాడుకోవాలంటే తప్పనిసరిగా మ్యాపింగ్ చేయించుకోవాలి. ప్రతీ ఓటరు ఈ మూడింటిపై అవగాహన కలిగి ఉండాల్సిందే. ఈ మూడు కేటగిరీల్లో మీరు ఏ కేటగిరి ద్వారా ప్రతీ ఓటరు తమ ఓటును కాపాడుకునేందుకు అవకాశం ఉందో తెలుసుకోవాల్సిన అవసరం తప్పనిసరి. లేదంటే జాబితాలో ఓటు గల్లంతు కావడం ఖాయం.