యాదగిరిగుట్ట, జూలై 20 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి వెండి మొక్కు జోడు సేవ అత్యంత వైభవంగా సాగింది. గురువారం సాయంత్రం స్వామివారిని గరుఢ వాహనంపై, అమ్మవారిని తిరుచ్చీపై వేంచేపు చేసి ప్రాకార మండపంలో ఊరేగించారు. తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతాన్ని వినిపించి స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు.
స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా జరిగింది. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవ జరిపారు. అనంతరం కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కల్యాణతంతు చేపట్టారు. ప్రధానాలయ ముఖమండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా సువర్ణ పుష్పార్చనలు జరిపారు. సాయంత్రం స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవలు వైభవంగా చేపట్టారు. రాత్రి స్వామివారికి తిరువరాధన చేపట్టి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన జరిపారు.
పాతగుట్ట స్వామివారికి నిత్యారాధనలు వైభవంగా సాగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. వర్షం కారణంగా భక్తులు తగ్గారు. 5 వేల మంది స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి ఆలయ ఖజానాకు రూ.9,80,740 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ గీత తెలిపారు. స్వామివారిని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఆశీర్వచనం చేయగా, ఆలయ పర్యవేక్షకుడు రాజన్‌బాబు స్వామివారి ప్రసాదం అందజేశారు. ఆయన వెంట సౌత్ సెంట్రల్ రైల్వే డివిజనల్ మేనేజర్ ఏకే గుప్తా, ఇతర అధికారులు ఉన్నారు.
భక్తులకు అందుబాటులోకి రైళ్లు..
లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు రైలును మరింత అందుబాటులోకి తీసుకొస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ ఆరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. గురువారం స్వామివారిని దర్శించుకున్న ఆయన మాట్లాడుతూ రాయగిరిలోని రైల్వే స్టేషన్లో ప్రతి రైలును నిలిపేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.