నల్లగొండ, అక్టోబర్ 27 : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నా నేటికీ విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా స్కాలర్షిప్ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఇవ్వకపోవడం సిగ్గుచేటు అని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.9 వేల కోట్లు విద్యార్ధులకు ప్రభుత్వం బాకీ ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేసి విద్యారంగంపై దృష్టి సారించి పెండింగ్‌లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే బెస్ట్ అవెలబుల్ స్కీమ్ (బాస్) పథకం కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని, ఓవర్సీస్ పథకం విదేశీ విద్యానిధికి పెండింగ్ లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేసి బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను ఆదుకోవాలన్నారు. ఈ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 29న బీఆర్ఎస్వీ విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చినట్లు తెలిపారు. కావున విద్యార్థులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి చల్లా కోటేశ్ యాదవ్, నాగార్జున సాగర్, ఇన్చార్జి పిల్లి అభినయ్, టౌన్ ఇన్చార్జి అంబటి ప్రణీత్, బీఆర్ఎస్వీ జిల్లా నాయకులు నోముల శంకర్ యాదవ్, నోముల క్రాంతి, కుంటిగొర్ల లింగయ్య, లక్ష్మణ్ కుమార్, సింగరి శివకుమార్, రాజు యాదవ్ పాల్గొన్నారు.