సూర్యాపేట టౌన్, నవంబర్ 08 : మహిళలు, యువతులు వేధింపులను ఉపేక్షించకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చునని, బాధితులు ఫిర్యాదులు చేసినప్పుడే పటిష్టంగా నిర్మూలించవచ్చన్నారు. మహిళల రక్షణ కోసమే షీ టీమ్స్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో సూర్యాపేట, కోదాడ డివిజన్ పరిదిలో షీ టీమ్ బృందాలు పనిచేస్తున్నాయన్నారు. షీ టీమ్ ఆధ్వర్యంలో వివిధ ప్రదేశాలలో, స్కూల్స్ , కాలేజీల్లో ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, పోక్సో, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఆత్మహత్యల నివారణ, డ్రగ్స్ దుష్ప్రభావాలు, బాల్య వివాహాల నిరోధం, వరకట్నం చట్టాలపై, నూతన మహిళా చట్టాలపై, డయల్ 100, T-SAFE యాప్, మహిళ భద్రత, రక్షణ చర్యలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తునట్లు తెలిపారు.
టీమ్ సభ్యులు ప్రత్యక్షంగా ఫిర్యాదులు తీసుకుంటారని, ఆన్లైన్, QR code, వాట్సప్ ద్వారా కూడా స్వీకరిస్తారన్నారు. మహిళలు, బాలికలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారు, సైబర్ నేరగాళ్లపై కూడా సైబర్, షీ టీమ్ సమన్వయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహిళలు, బాలికలు, విద్యార్థినులు షీ టీమ్ సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. ఎవరైనా వేధించినా, రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేళనగా మాట్లాడినా, ఉద్దేశపూర్వకంగా వెంబడించినా, అసభ్యకరంగా ప్రవర్తించినా, మాట్లాడినా విద్యార్థినులు, మహిళలు అత్యవసర పరిస్థితుల్లో జిల్లా పోలీస్ షీ టీమ్ నంబర్ 8712686056 కి కాల్ చేసి, లేదా వాట్సాప్ ద్వారా సందేశం పంపించి లేదా 100కు కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలని పేర్కొన్నారు.