తుంగతుర్తి, నవంబర్ 22 : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల (బాలికల) పాఠశాల అలాగే కళాశాలలో 2025 – 2026 విద్యా సంవత్సరం మొదలైన నుండి తెలుగు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులు బోధించడానికి లెక్చరర్స్ లేరు. దీంతో గత ఆరు నెలల నుండి విద్యార్థులకు సకాలంలో సిలబస్ కావడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వార్షిక పరీక్షలకు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉందని, సిలబస్ పూర్తి కాకపోతే విద్యార్థులు ఎలా పరీక్షలకు సన్నద్ధం అవుతారని వారు ప్రశ్నిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఖాళీగా ఉన్న సబ్జెక్టులకు అధ్యాపకులను నియమించాలని కోరుతున్నారు.
ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ అరుణ స్పందిస్తూ.. పాఠశాలలో జేఎల్ కు సంబంధించి ఐదు సబ్జెక్టులకు అధ్యాపకుల కొరత ఉన్నది వాస్తవమే అన్నారు. అధ్యాపకులను నియమించాలని పలుమార్లు జిల్లా ఆర్ సి ఓ కు, తెలంగాణ గిరిజన సాంఘిక సంక్షేమ చైర్మన్ కు పలుమార్లు లెటర్ పెట్టినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం పాఠశాలలోని కొంతమంది టీచర్లతో జేల్ విద్యార్థులకు కూడా సిలబస్ చెప్పిస్తున్నట్లు వెల్లడించారు.