కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ప్రభుత్వ వైద్యం మసకబారుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేద, మధ్య తరగతి వర్గాలకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసింది. వాటికి అనుసంధానంగా జనరల్ ఆసుపత్రుల బలోపేతం, పట్టణ, పల్లె దవాఖానలు విరివిగా ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించింది. వైద్య పరీక్షలకు అన్ని రోగాలకు మందులు అందించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం మందులు కూడా అందుబాటులో లేవు. ఏడాది క్రితం వరకు ఉమ్మడి నల్లగొండలోని సర్కారు దవాఖానలకు పేషెంట్లు పోటెత్తగా ప్రస్తుతం అరకొరగా వస్తున్నారు. గతంతో పోల్చుకుంటే ప్రసవాలు, ఓపీ పడిపోతున్నాయి. అత్యధికంగా అవసరం ఉండే యాంటీబయాటిక్స్, కాల్షియం, గ్యాస్ తదితర మందులు కూడా నెలల తరబడి అందుబాటులో లేవు. చిన్న రోగానికైనా ఎక్కించే స్లైన్ బాటిల్స్ కొరత ఉన్నది. యూరిన్ బ్యాగులు, పైపులు లేవు. బ్లడ్ గ్రూపింగ్ కిట్స్ కూడా మూడు నెలలుగా అందుబాటులో లేవు. చివరకు కాటన్ కూడా రోగులను బయటకు
పంపిస్తున్నారు.
తిరోగమనంలో వైద్య సేవలు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోగులకు ఉచిత వైద్యం అందక అవస్థలు పడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనరల్ దవాఖానతోపాటు ఏరియా ఆసుపత్రుల్లో వైద్య సేవలు దాదాపు పడిపోయాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న చివరి ఏడాది 2023లో జిల్లాలో 5,167 ప్రసవాలు కాగా, 2024లో 4,243 మాత్రమే జరిగాయంటే ప్రజలు ప్రభుత్వ దవాఖానలపై ఏ రీతిన నమ్మకం కోల్పోయారో అర్థమవుతుంది. ప్రభుత్వ దవాఖానల్లో డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండకపోవడం, సరిపడా మందులు లేకపోవవడం, జనరల్ ఆసుపత్రిలో అత్యధికంగా ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ విద్యార్థులే చికిత్సలు అందిస్తుండడం కారణంగా తెలుస్తున్నది.
కొన్ని మందులు బయటికే..
ఇక చిన్న, పెద్ద వ్యాధులకు తప్పనిసరి కావాల్సిన యాంటీ బయాటిక్, గ్యాస్ ట్రబుల్ గోలీలు, ఎమర్జెన్సీ డ్రగ్స్ చాలా వరకు ప్రభుత్వ దవాఖానల్లో లేవు. సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి వచ్చిన షేక్ అబ్దుల్లా అనే రోగి కడుపు నొప్పితో వస్తే ట్రామాడావ్, పాన్‌టాప్ లాంటి మందులను బయట కొనుక్కోమనడంతో ఆసుపత్రి బయట తీసుకున్నాడు. సిప్రోప్లాక్సిన్, ఎమైకైబిల్తో పాటు జలుబు, దగ్గుకు లియోసిట్రజిన్, కడుపు నొప్పి, గ్యాస్‌లకు పాన్‌టాప్, ట్రమాడాన్ లాంటి ఇంజక్షన్లు కూడా లేవు. మట్టయ్య అనే రోగికి సర్జరీ చేసేందుకు సిరమ్ ఎలక్ట్రోకిట్ను బయట కొనుగోలు చేశారు. బ్లడ్ గ్రూపింగ్ కిట్లు, శానిటైజర్లు, స్పిరిట్, మాస్క్‌లు కూడా అందుబాటులో లేవని ఏకంగా ఓ డాక్టర్ చెప్పడం గమనార్హం. గతంలో వార్డుకో ఈసీజీ మిషన్ ఉంటే నేడు ఒకే ఒక్కటే ఉన్నది. గతంలో కొనుగోలు చేసిన మిషన్లను కనీసం మరమ్మతులు చేయించలేని దుస్థితి సూర్యాపేట జనరల్ ఆసుపత్రిలో ఉంది. ఉన్న ఒక్క ఈసీజీ వద్ద కూడా కావాల్సిన జెల్ ట్యూబ్ బయట కొనుగోలు చేయిస్తున్నారు. దీనికి తోడు బీఆర్ఎస్ హయాంలో డయాగ్నస్టిక్ హబ్ ఏర్పాటు చేసి అన్ని రకాల పరీక్షలు చేయగా ప్రస్తుతం కొన్ని పరీక్షలు మాత్రమే చేస్తుండడంతో జనం ప్రభుత్వ వైద్యంపై ఆసక్తి చూపడం లేదు. మళ్లీ పూర్వ విధానం ప్రకారం ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయించే పరిస్థితి ఏర్పడింది.
చెవుల వినికిడి మందులు లేవు
నాకు చెవులు వినిపించవు. వాటికోసం భువనగిరి ప్రభుత్వ దవాఖానకు వచ్చిన. ఓపీలో పేరు రాపించుకుని డాక్టర్‌ను సంప్రదించగా చెరువులు వినిపించడానికి మందులు వాడాలని చెప్పాడు. చెవిలో వేసుకునే మందులు చిట్టిపై రాసిచ్చాడు. ఆ చిట్టిని పట్టుకుని మందులు ఇచ్చే కౌంటర్ వద్దకు వెళ్లగా అక్కడ చెవిలో వేసుకునే మందు అందుబాటులో లేదన్నారు. బయట మెడికల్ షాపులో కొనుక్కోవాలని చెప్పారు. డబ్బులు లేని పరిస్థితి ఉందని ఇక్కడికొస్తే మందులు లేకపోవడంతో ఏం చేయాలో తోయడం లేదు.
-ఐలయ్య, బండసోమారం, భువనగిరి మండలం
ఆయిట్మెంట్ బయట కొనుక్కోమన్నరు
నా కాలుకు దెబ్బ తాకడంతో పాయిజన్ అయ్యింది. పోయిన అక్టోబర్‌లో హైదరాబాద్‌లోని ప్రైవేటు దవాఖానలో చికిత్స చేయించుకున్నా. అక్కడ చాలా ఖర్చయ్యింది. అప్పటి నుంచి వారంలో రెండు సార్లు భువనగిరి ఏరియా దవాఖానలో డ్రెస్సింగ్ చేయించుకుంటున్నా. అందుకు సంబంధించిన ఆయింట్మెంట్ దవాఖానలో లేదని చెప్పిండ్రు. బయట కొనుక్కోమన్నరు. దానికి ఎంత డబ్బులవుతాయో తెల్వదు. అన్ని మందులు ఇక్కడ అందుబాటులో ఉంచితే మాలాంటి పేదలకు ఎంతో సయంగా ఉంటుంది.
-శ్రీనివాసాచారి, జైనపల్లి, బీబీనగర్ మండలం