నీలగిరి, ఆగస్టు 29 : నల్లగొండ జిల్లా కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి నాంపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన చింతకింది రమేశ్ (35) అనే వ్యక్తి పట్టణంలోని దేవరకొండ రోడ్లో గల అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ హత్యకు గల కారణం మాత్రం అందరిని విస్తుపోయేలా చేసింది. నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి శుక్రవారం పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన షేర్ సిరాజ్ నెల రోజుల క్రితం అతడికి తెలిసిన హుస్సేన్ అనే వ్యక్తి దగ్గర లారీ క్లీనర్‌గా చేరాడు. నెల రోజుల క్రితం ఇద్దరూ కలిసి లారీ లోడ్ తీసుకుని నల్లగొండ నుండి వెళ్తున్న క్రమంలో సిరాజ్ డ్రైవర్ హుస్సేన్‌తో గొడవ పడ్డాడు. దీంతో సిరాజ్‌ను లారీ నుండి దింపేసి హుస్సేన్ వెళ్లిపోయాడు. అప్పటి నుండి సిరాజ్ నల్లగొండ పట్టణంలో ఉంటూ చుట్టుపక్కల అడుకుంటూ అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద రూ.5 భోజనం చేసి అక్కడే నిద్రించేవాడు.
ఈ క్రమంలో ఈ నెల 27న రాత్రి 10 గంటల సమయంలో తాగిన మైకంలో ఉన్న రమేశ్ ప్రతిరోజు సిరాజ్ పడుకునే స్థలంలో పట్టా వేసుకుని నిద్రపోయాడు. దీంతో సిరాజ్ తాను రోజూ నిద్రించే స్థలంలో ఎందుకు పడుకున్నావని రమేశ్‌ను అడగగా, ఈ ప్లేస్ నీ అయ్యదా? నీవెవడవు నన్ను అడిగేందుకంటూ గొడవకు దిగాడు. చేతితో కొట్టి, నెట్టేసి బెదిరించడంతో సిరాజ్ అప్పటికి అక్కడి నుండి వెళ్లిపోయాడు. నా ప్లేస్‌లో పడుకోవడమే కాకుండా నన్నే వెళ్లగొడతాడా అని కక్ష పెంచుకుని సిరాజ్ గంట తర్వాత అక్కడికి తిరిగి వచ్చాడు. రమేశ్ నిద్రపోయింది గమనించి పక్కనే ఉన్న మొలదేలిన గ్రానైట్ రాయిని తీసుకుని రమేశ్ తలపై బలంగా కొట్టాడు. దీంతో రమేశ్ రక్తమోడుతూ అక్కడికక్కడే చనిపోయాడు. రాయి దొరకకుండా పక్కనే ఉన్న కాలేజీ గోడ వెనుక విసిరేసి సిరాజ్ అక్కడ నుండి పారిపోయినట్లు డీఎస్పీ తెలిపారు.
ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు హంతకుడు, హత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు డీఎస్పీ కె.శివరాం రెడ్డి ఆధ్వర్యంలో మూడు బృందాలు ఏర్పాటు చేశారు. పోలీసులు మృతుడి స్నేహితులు, బంధువులు, భార్య తరుపున అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. అలాగే నేర స్థలంలో లభించిన ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించి, చుట్టుపక్కల ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను జల్లెడ పట్టారు. దీంతో ఓ వ్యక్తి దుస్తువులపై రక్తపు మరకలు ఉన్న వ్యక్తి నడుచుకుంటూ వెళ్లడాన్ని గమనించి పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. అతడు అక్కడే యాచక వృత్తి చేస్తున్నట్లు తెలియడంతో సిబ్బంది పట్టణంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో గురువారం ఉదయం 6 గంటలకు రెహమాన్ బాగ్‌లోని ధమాకా బజార్ దగ్గర నిద్రిస్తున్న నిందితుడిని పోలీస్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. విచారించగా తానే బండరాయితో కొట్టి చంపినట్లుగా వెల్లడించాడు. పోలీసులు హత్యకు వినియోగించిన రాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. హత్య కేసును కేవలం 24 గంటల్లోనే చేధించిన, నిందితుడిని అరెస్ట్ చేయడంలో ప్రత్యేక పాత్ర పోషించిన డీఎస్పీ కొలను శివరాం రెడ్డి, వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ వెంకట్ నారాయణ, ఏఎస్ఐ వెంకట్ యాదవ్, హెడ్ కానిస్టేబుల్ రబ్బాని, కానిస్టేబుల్ సాగర్ల శంకర్, షకీల్, శ్రీకాంత్, జానకి రాములు, తిరుమలేశ్, హోంగార్డు సైదులు, కృష్ణారెడ్డికి ఎస్పీ అభినందనలు తెలిపారు.