వేములపల్లి, అక్టోబర్ 17 : ప్రముఖ వాణిజ్య కేంద్రం మిర్యాలగూడ, అద్దంకి-నార్కెట్పల్లి హైవేకు ఆనుకుని ఉన్న గ్రామం శెట్టిపాలెం. సుమారు 6,500 జనాభా గల ఈ గ్రామానికి కీడు వచ్చిందంటూ ఊరుఊరంతా ఇండ్లకు తాళం వేసి గురువారం వనవాసానికి వెళ్లింది. ఏడాది నుంచి ఊళ్లో వరుస మరణాలు చోటుచేసుకుంటుండడంతో గ్రామ పెద్దలు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు.
శ్రావణ మాసంలో వనభోజనాలు నిర్వహించినప్పటికీ గ్రామస్థులంతా పూర్తి స్థాయిలో చెట్ల కిందకు వెళ్లనందున.. ఈసారి ప్రతి కుటుంబం వనవాసానికి వెళ్లాలని బుధవారం డప్పు చాటింపు వేయించారు. గురువారం ఉదయం కల్లాపి చల్లకుండానే, మొహాలు కడుగకుండానే ఇండ్లకు తాళం వేసి వనవాసానికి వెళ్లారు. గ్రామానికి నాలుగు మూలల రాజేసిన నిప్పు నుంచి ఒక్కో కణికను తీసుకెళ్లి పొయ్యి వెలిగించి చెట్ల కిందే వంటలు చేసుకున్నారు. రోజంతా అక్కడే ఉండి సూర్యాస్తమయం తర్వాత ఊళ్లోకి చేరుకుని ఇండ్లను శుద్ధి చేసుకున్నారు.
వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం గ్రామంలో 50 ఏండ్ల క్రితం ఇలాగే వరుస మరణాలు చోటు చేసుకున్నట్లు గ్రామానికి చెందిన వృద్ధులు తెలిపారు. అప్పట్లో గ్రామ పెద్దల తీర్మానం మేరకు ఇలాగే ఊరు ఖాళీ చేసి వెళ్లినట్లు తెలిపారు. ఊరుకు ఆవల వంటల చేసుకుని సాయంత్రం తిరిగి ఇండ్లకు వచ్చినట్లు గుర్తుచేసుకున్నారు.