దేవరకొండ, ఏప్రిల్ 24 : నర్సంపేటలో ఆర్టీసి డ్రైవర్ శంకర్ గౌడ్‌ది ఆత్మహత్య కాదు అని అది ముమ్మాటికీ రేవంత్ సర్కారు చేసిన హత్యే అని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం దేవరకొండ పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కార్మికుల ప్రాణాలు ఇలా చవకబారిపోయాయా? ఇందుకోసమేనా పోరాడి తెలంగాణ సాధించుకుంది అని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఒక అమాయక ప్రాణం బలైంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లుగా సీఎం రేవంత్ ఆర్టీసి కార్మికులకు చేస్తున్న తీరని ద్రోహాన్ని తట్టుకోలేకే శంకర్ గౌడ్ గారు బలవన్మరణానికి పాల్పడ్డారన్నారు.
40 రోజుల ముందే నోటీసు ఇచ్చినా స్పందించని నిర్లక్ష్యపు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ప్రజల కోసం పని చేసే ఆర్టీసీ కార్మికులను ఇంతలా నిర్లక్ష్యం చేయడం దారుణం అన్నారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, వారి ప్రాణాలతో ఆడుకుంటోందని విమర్శించారు. శంకర్ గౌడ్ కుటుంబానికి తక్షణ న్యాయం చేయాలని, శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి అన్నివిధాలా ఆదుకోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ సవాలక్ష హామీలిచ్చిన రేవంత్ రెడ్డి కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటికీ నెరవేర్చక పోవడంతోనే ఆర్టీసి కార్మిక లోకం ఇవాళ తీవ్ర నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతోందన్నారు.
ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్రలను ఇకనైనా మానుకుని ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి, ఇచ్చిన హామీలను, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. రాష్ట్రంలో ఒకేరోజు ముగ్గురు ఆర్టీసి డ్రైవర్లు ఆత్మహత్య ప్రయత్నాలు చేసిన సంఘటన తెలంగాణ చరిత్రలో ఓ చీకటి రోజుగా మిగిలి ఉంటుందన్నారు. తెలంగాణలో ఏకకాలంలో ఇన్ని బాధాకరమైన సంఘటనలు జరిగినా మానవత్వం లేని కాంగ్రెస్ సర్కారులో కనీసం చలనం లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఆర్టీసి కార్మిక సోదరుల్లారా దయచేసి మనోధైర్యాన్ని కోల్పోకండి. మీ పోరాటాలకు బీఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని తెలిపారు. ఈ నిరంకుశ కాంగ్రెస్ సర్కారు, ఈ అసమర్థ ముఖ్యమంత్రి మెడలు వంచి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన హక్కులను సాధించేంత వరకు ఉద్యమిద్దాం అని ఆయన పిలుపునిచ్చారు.