నల్లగొండ విద్యా విభాగం (రామగిరి), ఏప్రిల్ 17 : నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో మౌలిక వసతులు కల్పించాలని, విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ అందించాలంటూ పలు డిమాండ్లతో గురువారం యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ కు వర్సిటీ ఎస్ఎఫ్ఐ విద్యార్థులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనివర్సిటీలో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నట్లు తెలిపారు.
అదేవిధంగా విద్యతో పాటు కోకరిక్యులం అంశాల్లో సైతం ప్రత్యేక శిక్షణ అందించాలని, కళారంగంలో ఆసక్తి ఉన్న విద్యార్థులను ఆ దిశగా ప్రోత్సహించేలా శిక్షణను అందించాలని కోరారు. యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు చదువు పూర్తి కాగానే జీవితంలో స్థిరపడేలా నైపుణ్యాభివృద్ధి అందేలా చూడాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఆ సంఘం నాయకులు కర్రం రవికుమార్, బాల సంపత్, వెంకటేశులు ఉన్నారు.