యాదాద్రి భువనగిరి, జూలై 2 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వానకాలం వచ్చినా సాగు నీటి కష్టాలు తప్పడంలేదు. వరుణుడు కరుణించడంలేదు. చెరువుల్లో నీరు లేక ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఇంకో వైపు వాగులు, వంకలు వట్టిపోయాయి. వర్షాలు, నీరు లేక సాగు కూడా ముందుకు సాగడంలేదు. దీంతో రైతుల సాగుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి.
జిల్లాలో 1155 వరకు చెరువులు ఉన్నాయి. వీటిల్లో సగానికి పైగా ఎండిపోయే దశకు వచ్చాయి. అనేక చోట్ల చుక్క నీరు లేదు. మొత్తం గా పరిశీలిస్తే సగటున జిల్లాలోని చెరువుల్లో 25 శాతం నీరు కూడా లేదు. మూసీ బెల్టులో మాత్రమే కొన్ని చెరువులు కళకళలాడుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 58శాతం చెరువుల్లో 58 శాతం చెరువుల్లో అంటే 668 చెరువుల్లో 25 శాతం లోపే నీళ్లు ఉం డటం గమనార్హం. 25 నుంచి 50 శాతం మధ్య 17 శాతం చెరువుల్లో, 50 నుంచి 70 శాతం మధ్య 17 శాతం చెరువుల్లో నీళ్లు ఉన్నాయి. 75 శాతం నుంచి 100 శాతం నీళ్లు ఉన్న చెరువులు కేవలం 8 శాతం మాత్రమే నమోదయ్యాయి. ఒక్క శాతం చెరువుల్లో మాత్రం నిండుగా నీళ్లు ఉన్నాయి.
భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. వర్షాలు లేకపోవడంతో నీళ్లు ఇంకింత పడిపోతున్నాయి. జూన్‌లో సగటున 9.50 మీటర్లుగా నమోదైంది. తుర్కపల్లి మండలంలోని కోనాపూర్‌లో అత్యధికంగా 18.22 మీటర్ల లోతులోకి నీళ్లు ఇంకాయి. ఇక భువనగిరి మండలంలోని చందుపట్లలో 16, బీబీనగర్‌లో 15.26, బొమ్మలరామారంలో 15.21 మీటర్లు, రాజాపేట మండలంలోని సోమారంలో 15.16, రఘునాథపురంలో 15, రామన్నపేట మండలం ఇస్కిళ్లలో 14.91 మీటర్లు, ఆలేరు మండలం శారాజీపేటలో 14.29, ఆత్మకూరులో 14.12 మీటర్ల లోతులో ఉన్నాయి. మూసీ ప్రాంతమైన పోచంపల్లి మండలంలోని వంకమామిడిలో 2.30 మీటర్లలోనే నీళ్లు ఉన్నాయి.
జిల్లాలో 31 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 99.3 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేయగా, మంగళవారం 68.4 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇక అనేక మండలాల్లో లోటు వర్షపాతమే నమోదైనట్లు లెక్కలు చెబుతున్నాయి. తుర్కపల్లి, రాజాపేట, భువనగిరి, బీబీనగర్, గుండాల మండలాల్లో భారీ లోటు వర్షపాతం నమోదైంది. ఆలేరు, మోటకొండూరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, రామన్నపేట మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది.
వానకాలం సీజన్‌కు సంబంధించి సాగు పనులు నెమ్మదిగా నడుస్తున్నాయి. వర్షాలు లేక, సాగు నీరు అందక పొలం పనులకు ముందుకు సాగడం లేదు. ఈ సీజన్లో యాదాద్రి జిల్లా వ్యాప్తంగా 4,46,604 ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కానీ ఇప్పటి వరకు 43,283 ఎకరాల్లో మాత్రమే సాగు జరుగుతోంది. ఇం దులో 7752 ఎకరాల్లో వరి, 38741 ఎకరాల్లో పత్తి వేశారు. వర్షాలు ఆలస్యం కావడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.