రామగిరి, జూలై 17 : ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పాలనలో దేశంలో సంక్షోభం ఏర్పడిందని అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్ అన్నారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలోని ఏచూరి గార్డెన్ లో నిర్వహించిన అఖిల భారత కిసాన్ సభ 36వ మహాసభ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో విజ్జు కృష్ణన్ మాట్లాడారు. 36వ అఖిల భారత కిసాన్ సభ మహాసభలు నవంబర్ 18 నుండి 24వ తేదీ వరకు నల్లగొండ పట్టణంలో నిర్వహించబోతున్నట్లు తెలిపారు. మోదీ ప్రభుత్వంలో సంక్షోభం కారణంగా 5 లక్షల మందికి పైగా రైతులు, వలస కార్మికులు, వ్యవసాయ కార్మికులు, ఆదివాసి రైతులు, మహిళా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. అదే బీజేపీ 12 సంవత్సరాల పాలనలో 10 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని విచారం వ్యక్తం చేశారు.
2020 కరోనా సమయంలో లాక్ డౌన్ పెట్టి మూడు నల్ల చట్టాలని తీసుకొచ్చారని తెలిపారు. ఢిల్లీలో సంవత్సరం పైగా జరిగిన రైతు ఉద్యమం ఫలితంగా ఈ చట్టాలను వెనక్కి తీసుకున్నారు. బీహార్ ఎన్నికల తర్వాత మళ్లీ ఈ నల్ల చట్టాలను దొడ్డి దారిన తీసుకొచ్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. ఈ కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు జూలై 29న ఢిల్లీలో సంయుక్త కిసాన్ సభ ట్రేడ్ యూనియన్లు వ్యవసాయ కార్మిక సంఘాలు కలిసి సదస్సు నిర్వహించనున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 10న అన్ని రాష్ట్రాల్లో కార్మిక కర్షక ఐక్యతతో పది లక్షల మందితో జైల్ బరో నిర్వహించనున్నామని పేర్కొన్నారు.
కార్పొరేట్ వ్యవసాయానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమాలలో 736 మంది రైతులు చనిపోయారని తెలిపారు. అమెరికా, న్యూజిలాండ్, యూరోపియన్ దేశాల నుండి పత్తి, సోయాబీన్ ఇతర పంటల దిగుమతులపై సుంకాలను తగ్గించారని దీని కారణంగా దేశంలో తీవ్రమైన సంక్షోభం ఏర్పడనుందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ నుండి పాలు దిగుమతి చేసుకోనున్నారని, అప్పుడు దేశంలోని రైతుల పరిస్థితి ఏంటి అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రైతులు కార్మికులు కర్షకులు పోరాడాలని పిలుపునిచ్చారు.