యాదగిరిగుట్ట, జూలై 22: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీలో ముసలం ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఒట్టెత్తు పోకడతో పాటు పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన నాయకులను పక్కన పెట్టడంపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన పార్టీ మండల కమిటీ ఎన్నికతో పాటు జడ్పీటీసీ అభ్యర్థిత్వంపై పలువురు సీనియర్ నాయకులు అలిగిన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు అధికారిక కార్యకలాపాలతో పాటు కాంగ్రెస్ సంస్థాగత సమావేశాలకు దాదాపుగా దూరమైన్నట్లు తెలిసింది.
ఇటీవల మండలంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొనగా… సీనియర్ నాయకులు కనిపించలేదు. ఇక ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సైతం ఆ నాయకులు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్తో పాటు అధికార కాం గ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేపట్టారు. యాదగిరిగుట్ట జెడ్పీటీసీ స్థానం పోటీకి కాం గ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకులు బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు.
ఇందులో ప్రధానంగా మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, కాంగ్రెస్ మాజీ మండలాధ్యక్షుడు కానుగు బాలరాజుగౌడ్, మల్లాపురం మాజీ సర్పంచ్ మంగ సత్యనారాయణ పేర్లు బలంగా వినిపించినా ఆశలను నీరుగార్చినైట్లెంది. వీరంతా బీర్ల అయిలయ్య విజయానికి అహర్నిశలు కృషి చేశారు. అతేకాకుండా ఇందులో కొందరు నేతలు డబ్బు సహాయం కూడా చేశారన్న ప్రచారం ఉంది. వీరందరినీ పక్కనపెట్టి తన సోదరుడైన సైదాపురం మాజీ సర్పంచ్ బీర్ల శంకర్‌కు జెడ్పీటీసీ బరిలో దించాలని ఎమ్మె ల్యే బీర్ల అయిలయ్య ఆలోచిస్తున్నట్లు విశ్వనీయవర్గాల సమాచారం.
ఈ నేపథ్యంలోనే తన సామాజిక వర్గంలో ఒకరైన మంగ సత్యనారాయణకు కాంగ్రెస్ మండల అ ధ్యక్ష పదవి కట్టబెట్టి ఆయనను జడ్పీటీసీ పదవి పోటీకి రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో దాదాపుగా సక్సెస్ అయ్యారు. గతంలో తన సోదరుడైన బీర్ల శంకర్‌ను రాజాపేట మండలం నుంచి జడ్పీటీసీ బరిలో దించాలని యోచించినా ఇటీవల కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత నేపథ్యం లో ఓటమి ఖాయమనే సంకేతాలు వచ్చాయి.
దీంతో తన సొంత మండలమైన యాదగిరిగుట్ట నుంచి బరిలో దింపాలని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చూస్తున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలో జెడ్పీటీసీ పదవి పోటీలో ఉండేందుకు సిద్ధమైన పార్టీ సీనియర్ నాయకులకు నిరాశే మిగిలిందని తెలిసింది. గత 20 ఏళ్లుగా కాంగ్రెస్‌లోనే ఉంటూ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీర్ల అయిలయ్యతో నడిచి.. ఆయన విజయానికి కృషి చేసిన సీనియర్ నాయకులను పట్టించుకోవడం లేదని అలిగిన్నట్లు తెలుస్తోంది.
పార్టీ మండల కమిటీ ఎన్నికపై నిరాశే..
పార్టీ కష్టకాలంలో మండల అధ్యక్షుడిగా ఉం టూ.. పార్టీని కాపాడుకుంటూ వచ్చిన సీనియ ర్ నాయకుడికి ఎలాంటి సమాచారం లేకుండానే ఆయనను పార్టీ పదవిని నుంచి ఎమ్మె ల్యే తప్పించిన్నట్లు అత్యంత విశ్వనీయవర్గాల సమాచారం. అధికారంలో లేని ఆపత్కాలంలో అధ్యక్ష పదవిలో కొనసాగుతూ అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఎంతో శ్రమించిన నాయకులను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్న చర్చ సాగుతోంది.
ఇన్ని రోజులు తమను వాడుకుని అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే తన కురుమ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ ఇతర కులస్తులను దాదాపుగా దూరం చేసుకుంటున్నారని ఆ పార్టీ వర్గాలే గుసగుసలాడుతున్నాయి. గతంలో ఉన్న పార్టీ మండల అధ్యక్షుడు, గౌడ సామాజికవర్గానికి చెందిన కానుగు బాలరాజును ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అవమానించిన్నట్లు తెలుస్తోంది. ఎలాంటి సమాచారం లేకుండానే పార్టీ మండల నూతన అధ్యక్షుడిగా మంగ సత్యనారాయణను ఎన్నుకున్నట్లు చర్చ సాగుతున్నది.
దీనిపై మాజీ అధ్యక్షుడు కానుగు బాలరాజు నిరాశతో ఉన్నట్లుగా సమాచారం. ఇటీవల అధ్యక్ష పదవి ఎన్నిక, సన్మాన సభకు ఆయన హాజరు కాలేదు. మండలంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ మాజీ అధ్యక్షులతో క్యాంపు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయాలు తీసుకున్నట్లు అత్యంత విశ్వనీయవర్గాల సమాచారం.
ఈ విషయంపై కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కానుగు బాలరాజును వివరణ కోరగా అలాంటిదేమిలేదన్నారు. పార్టీ మండల అధ్యక్ష ఎన్నిక సమయంలో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య నాతో సంప్రదించారని తెలిపారు. ఎన్నో సమస్యలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 20 ఏం డ్లు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పని చేశా మని, ఏనాటికైనా పార్టీలో కొనసాతానని చెప్పారు. అధిష్టానం ఆదేశిస్తే జడ్పీటీసీ పదవికి పోటీ చేసేందుకు సిద్ధమేనని చెప్పడం కొసమెరుపు.
హరీశ్‌రావు టచ్‌లోకి కాంగ్రెస్ సీనియర్ నాయకులు
ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తీరును, తమ పార్టీలో సముచ్చిత గౌరవం దక్కలేదని.. ఇక పార్టీలో ఉంటే లాభంలేదని పలువురు మండలానికి చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేకు గట్టిషాకే ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చిన్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్యతో కలిసి ఇటీవల మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును యాదగిరిగుట్ట మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు టచ్‌లోకి వెళ్లిన్నట్లు అత్యంత విశ్వనీయవర్గాల సమాచారం. త్వరలో వీరందరూ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి నేతృత్వంలో హరీశ్‌రావు సమక్షంలో గులాబీ గూటికి చేరవడం ఖాయమనే చర్చ సాగుతోంది.