నీలగిరి, నవంబర్ 6: నల్లగొండ మెడికల్ కళాశాలలో మరోమారు ర్యాగింగ్ కలకలం రేపిం ది. సీనియర్ విద్యార్థులు మొదటి సంవత్స రం విద్యార్థులపై వేధింపులకు పాల్పడ్డారు. గత నెల 31వ తేదీ రాత్రి బాలుర (మెడికల్ కళాశాల) హాస్టల్లో పాటలు పాడి తమను సంతోషపెట్టాలంటూ సీనియర్లు జూనియర్లపై ఒత్తిడి తెచ్చారు. ఇద్దరు ముగ్గురు విద్యార్థులు తమకు వచ్చిన పాటలు పాడి వెళ్లిపోయారు. మరికొంతమంది తమకు పాటలు రావంటూ వదిలివేయాలని వేడుకున్నారు. కచ్చితంగా ఏదో ఒక పాట పాడాల్సిందేనని వారు వత్తిడి తేవడంతో ఇరువర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.
విషయం పెద్దది కావడంతో కొంతమంది సీనియర్లు కలుగజేసుకుని జూనియర్లను పంపించి వేశారు. ఈ విషయమై జూనియ ర్లు తమ కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు నిర్భయంగా వార్డెన్, ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయాలని సూచించడంతో ప్రిన్సిపాల్, వార్డెన్లకు ఫిర్యాదు చేశా రు. గతంలోనూ సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డంతో ముగ్గురు విద్యార్థులను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ర్యాగింగ్‌కు పాల్పడితే మీకూ అదే గతి పడుతుందని, మీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వదిలేస్తున్నానంటూ ప్రిన్సిపాల్ సీనియర్లను మందలించారు.
దీంతో కోపం పెంచుకున్న సీనియర్లు మాపైనే ఫిర్యాదు చేస్తారా అంటూ ఈనెల 4న మీ నిక్‌నేమ్ చెప్పండి.., రేపటి నుంచి ఆ పేర్లతోనే మిమ్మల్ని పిలుస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. మరోవైపు జూనియర్ విద్యార్థులను కూడా కళాశాల సిబ్బంది మందలించినట్లు తెలిసింది. ర్యాగింగ్ చేసిన వారిని కాదని బాధితులైన తమను ప్రిన్సిపాల్ మందలించడంతో ఏం చేయాలో తెలియని జూనియర్లు తమ కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేయడంతో విషయం కాస్తా బయటకు పొక్కింది. దీంతో సోషల్ మీడియాలో మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ జరిగిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే అలాంటి సంఘటనలేమీ జరగలేదంటూ ప్రిన్సిపాల్ సత్యనారాయణ ప్రకటన విడుదల చేశారు.