బీఆర్ఎస్ పార్టీ 25 వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా రజతోత్సవాల ప్రారంభ సూచికగా వరంగల్‌లో నిర్వహించ తలపెట్టిన సభ సక్సెస్ కోసం గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో సన్నాహాక సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. కేవలం పార్టీ జిల్లా స్థాయి ముఖ్య నాయకులతో సమావేశం అనుకుని ఆహ్వానం కూడా వారికే పంపారు. కానీ, అనూహ్య రీతిలో బీఆర్ఎస్ శ్రేణులతోపాటు కాంగ్రెస్ పాలనలో పంటలు ఎండి గోస తీస్తున్న రైతులతోపాటు యువతీయువకులు వేలాదిగా తరలిరావడం గులాబీ శ్రేణుల్లో మరింత జోష్‌ను నింపింది. జనగామ క్రాస్‌రోడ్ నుంచి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం వరకు దాదాపు 10వేల బైక్‌లతో సాగిన భారీ బైక్ ర్యాలీలో రోడ్డుకు ఇరువైపులా, మిద్దెలపైనా జనం నిలబడి కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డికి చేతులు ఊపడం.. మళ్లీ బీఆర్ఎస్ రావాలని ఆకాంక్షించడం విశేషం.
‘సూర్యాపేటలో కార్యకర్తల సమావేశానికి వస్తే 5 కిలోమీటర్ల ర్యాలీలో ఎక్కడికక్కడ ప్రజలు బారులుదీరి… ఎన్నికల రోడ్‌షో మాదిరిగా చేతులు ఊపుతూ.. మళ్లీ మీరే వస్తారు.. తప్పకుండా గెలవాలి అని ఆశీర్వదించారు. 15 నెలలు తిరుగకుండానే ఈ పరిస్థితి వచ్చిందంటే అది కార్యకర్తల పోరాట పటిమ. రేపు స్థానిక సంస్థలు కావచ్చు.. ఉప ఎన్నికలు కావచ్చు.. రాబోయే శాసనసభ ఎన్నికలు కావచ్చు.. అన్నింటిలోనూ తిరిగి గులాబీ జెండా ఎగురాలి అంటే ప్రతీ కార్యకర్త ఒక కేసీఆర్‌లాగా కథనాయకులై ఉద్యమించాలి’ అంటూ కేటీఆర్ ఇచ్చిన ఉత్తేజభరితమైన ప్రసంగం బీఆర్ఎస్ శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపింది.
సూర్యాపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశం గ్రాండ్ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. వాస్తవానికి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల ముఖ్యకార్యకర్తలతోనే సమావేశం అని ప్రకటించగా.. రైతులు, యువత పెద్ద సంఖ్యలో రావడంతో అది బహిరంగ సభను తలపించింది. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంతోపాటు చుట్టూ వేలాది మంది కనిపించారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని చెప్తూనే నూతన కమిటీలపై సమావేశం వేదిక పైనుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. పని చేసేవారికి పార్టీలో గుర్తింపు ఉంటుందని, అంకితభావం, నిబద్ధతతో పని చేసే వారికి పెద్దపీట ఉంటుందని స్పష్టం చేశారు.
పార్టీలో అందరం సమానమేనంటూ ఈ ఏడాది మనకు పోరాట నామ సంవత్సరం అని ప్రకటించడంతో కేడర్ సమరోత్సాహంతో ఉంది. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ సభకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం విదితమే. ప్రధానంగా ఈ సభతో ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను బహిర్గతం చేశారు. జిల్లా కేంద్రంలో ర్యాలీ జరిగినంత దూరం పెద్దఎత్తున జనం జేజేలు పలకడం తమకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ముఖ్య కార్యకర్తల సమావేశం అంటే వరంగల్ సభకు గ్రామాల వారీగా, నియోజకవర్గానికి ఇంతమంది రావాలని నాలుగు ముచ్చట్లు చెప్పి వెళ్తారనుకుంటే ఊహించిన దానికి భిన్నంగా పార్టీ శ్రేణుల్లో మనోధైర్యం నింపారని పార్టీలో తొలినాళ్ల నుంచి ఉంటున్న ఓ సీనియర్ నాయకుడు హర్షం వ్యక్తంచేశారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగంలో పార్టీ పుట్టుక నుంచి ఇప్పటివరకు జరిగిన కీలక ఘట్టాలు, పదేండ్ల బీఆర్ఎస్ పాలన చేసిన అద్భుతాలను వివరించడంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలు, బీఆర్ఎస్పై కోపంతోనే రైతుల పంటలను ఎండబెడుతున్న తీరుపై విమర్శలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పవర్ఫుల్ పంచ్ డైలాగులు విసిరారు. సర్కారు వైఫల్యాలను ఎండగట్టిన తీరు శ్రేణులను ఎంతగానో ఆకట్టుకుంది. సీమాంధ్ర నేతలు, వారి మోచేతి నీళ్ల కోసం ఆశపడ్డ ఈ ప్రాంత తొత్తులు కొందరు తెలంగాణ నడిబొడ్డున కూర్చుని తెలంగాణ అనే పదాన్ని నిషేధించిన రోజుల్లో కేసీఆర్ ఒక్కడుగా టీఆర్ఎస్ స్థాపించి లక్షలాదిని జమచేసి ప్రపంచానికి తెలంగాణ గడ్డ ఉందని చాటి చెప్పిండంటూ వివరిస్తున్న సమయంలో అంతా పిన్‌డ్రాప్ సైలెంట్‌గా విన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి అసమర్థులు అంటూ విమర్శలు గుప్పించారు. వారి అసమర్థతతోనే పంటలు ఎండుతున్నాయని ధ్వజమెత్తడంతో అక్కడకు వచ్చిన రైతాంగం చప్ప ట్లు కొడుతూ కాంగ్రెస్‌కు శాపనార్థాలు పెట్టడం కనిపించింది.
అబద్దాల పునాదులపై నిలబడి కొంతమంది విష ప్రచారాలు చేయడం, మోసపూరిత వాగ్దానాలతో ప్రజల్లో లేనిపోని ఆశలు కల్పించడంతోనే ఓటమి పాలయ్యాం తప్ప మనం బాగా చేయలేదనేది జనం అనుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో జనమంతా మనవైపే చూస్తున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అంతకుముందు సూర్యాపేట పట్టణంలో జరిగిన ర్యాలీనే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ర్యాలీ జరిగిన తీరు.. జనం నుంచి వచ్చిన స్పందన.. చూపించిన అభిమానంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇలా అనేక విషయాలపై మాట్లాడుతూ ఇది మనకు పోరాట నామ సంవత్సరం అంటూ పార్టీ సంస్థాగత నిర్మాణం పై స్పష్టత ఇవ్వడంతో పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం కనిపించింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేస్తామని, జిల్లా కార్యాలయాలను చైతన్య కేంద్రాలుగా మార్చి క్యాడర్‌కు శిక్షణ ఇస్తామని తెలిపారు.
ప్రభుత్వం పోయిన తరువాత కొంతమంది నాయకులు పోయారని, ఆ ఖాళీలను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. నిబద్ధత, అంకిత భావంతో పని చేసే వారికి పెద్దపీట వేస్తానమంటూ పార్టీలో అందరమూ సమానమేనని ప్రకటించడం మరింత విశ్వాసాన్ని నింపిందని సీనియర్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పెద్దఎత్తున పంటలు ఎండిపోతుంటే మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి పొలాల్లో పర్యటిస్తూ రైతుల్లో మనోధైర్యం నింపుతున్న ఫలితం మీటింగులో కనిపించిందని, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, బొల్లం మల్లయ్యయాదవ్ చేస్తున్న కృషి అభినందనీయం కేటీఆర్ వ్యాఖ్యానించడంతో ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన క్యాడర్ ఈలలు వేసింది. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక సార్లు అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ సభలు జరుగాయి. ఎన్నికల సమయాల్లో ప్రచార సభలు జరిగాయి. కానీ ప్రతిపక్షం లో ఉండి అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపుతూనే బీఆర్ఎస్ పార్టీ పటిష్టానికి కేటీఆర్ చేసిన దిశానిర్ధేశం అద్భుతమని సీనియర్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.