సూర్యాపేట, జనవరి 5 (నమస్తే తెలంగాణ): సూర్యాపేటలోని కాంగ్రెస్ పార్టీ కొద్ది సంవత్సరాలుగా దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేశ్‌రెడ్డి వర్గాలుగా విడిపోయిన విషయం విదితమే. తాజాగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తండు శ్రీనివాస్ యాదవ్ సోమవారం సూర్యాపేటలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి పార్టీ నాయకుల వ్యవహార శైలిపై ధ్వజమెత్తారు. కొంతమంది ఒంటెత్తు పోకడలతో ఎంతో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సూర్యాపేటలో వరుసగా ఓటమి పాలవుతోందన్నారు.
ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో అయినా తొలి నుంచి జెండా మోస్తూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే టిక్కెట్లు ఇవ్వాలన్నారు. పార్టీ మారి వచ్చి పెత్తనం చెలాయిస్తామంటే ఊరుకునేది లేదని, నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యేలు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు, మున్సిపల్ మాజీ చైర్మన్లు, మాజీ ఫ్లోర్ లీడర్లు, సీనియర్ నాయకులతో కలిసి సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి టిక్కెట్లు కేటాయించాలన్నారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడికి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌కు లిఖితపూర్వకంగా లేఖ రాయనున్నట్లు తెలిపారు. ప్రధానంగా తాను పట్టణ ఎన్ఎస్యు ఐ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్, మార్కెట్ కమిటీ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్‌తో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పదవుల్లో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని కొనసాగుతున్నా తనను సన్నాహక సమావేశానికి పిలవకపోవడంపై తీవ్ర ఆవేదనకు గురయ్యానన్నారు.
ఇరవై ఏండ్లుగా పార్టీ కోసం పని చేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటున్న వారు.. కౌన్సిలర్ టిక్కెట్లు ఆశిస్తున్నారని, వారిని కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అవకాశం ఇస్తే సహించేది లేదన్నారు. భజన చేసే వారికి కాకుండా పార్టీ కోసం పనిచేసే వారికే టిక్కెట్లు ఇవ్వాలన్నారు. మున్సిపాలిటీల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేసి పార్టీ పరంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని, పార్టీ కోసం ఎవరు పిలిచినా వెళ్తానన్నారు.
జిల్లాలో బీసీలకు అన్యాయం జరుగుతోందని, డీసీసీ అధ్యక్ష పదవిని బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి ఉండగా ఎస్సీ ఎమ్మెల్యే ఉన్న తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన ఎస్సీలకే కేటాయించారని, అలాగే అదే నియోజకవర్గంలో ఫైనాన్స్ కమిషన్ మెంబర్, రైతు కమిషన్ మెంబర్లను కూడా ఎస్సీలకే కేటాయించారని, ఎస్సీలకు కేటాయించడం సంతోషమే అయినా, బీసీలకు కూడా న్యాయం చేయాలి కదా అని ప్రశ్నించారు. జిల్లాలో ఓసీలకు తప్ప బీసీలకు పదవులు రావడంలేదని, టూరి జం కార్పొరేషన్ చైర్మ న్, గ్రంథాలయ సంస్థ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఇలా అన్నీ ఓసీలకే కేటాయించడంతో బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. సూర్యాపేట జిల్లాలో బీసీలకు న్యాయం చేయడంతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే టిక్కె ట్లు ఇచ్చేలా పీసీసీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జికి లేఖ రా యనున్నట్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.