చండూరు, జూన్ 23 : చండూరు మండలం కస్తాల రైతు వేదిక నందు గ్రామ సర్పంచ్ లేదండ సత్యనారాయణ అధ్యక్షతన మంగళవారం విత్తన మేళా కార్యక్రమం నిర్వహించారు. చండూరు మండల వ్యవసాయ అధికారి మల్లేష్ వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం సూచించిన 7 రకాల సన్నధాన్యం వంగడాలను మాత్రమే సాగు చేయాలని, ఈ వంగడాలకు సంబంధించిన సాంకేతిక సూచనలు, సలహాలు అందించేందుకు కస్థాల రైతు వేదికలో మంగళవారం నుండి విత్తన మేళా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. BPT 5204 (సాంబమసూరి), HMT సోనా, RNR-14038, జై శ్రీరామ్ (Jai sreeram), KNM-1638, KNM-7715, WGL-44 రైతులు ఈ 7 రకాల వరి విత్తనాలను సాగు చేసి బోనస్ ని పొందగలరని తెలిపారు.
ఈ వానాకాలం సీజన్లో ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున రైతులు నీటి అవసరం తక్కువగా ఉండే పంటలపై దృష్టి సారించాలన్నారు. కంది, మినుము,పెసర పప్పు ధాన్యాలు ,చిరుధాన్యాలు, కూరగాయలు, ఆముదము, నువ్వులు సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ, వైస్ చైర్మన్ పోలు వెంకట్ రెడ్డి, మార్కెట్ కమిటీ, సహకార సంఘం డైరెక్టర్లు భూతరాజు ఆంజనేయులు కట్ట భిక్షం, ఏఈఓలు మహేష్, నాగార్జున, పద్మజ, జగన్, గ్రామ రైతులు మేకల సాగర్ రెడ్డి, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.