నల్లగొండ సిటీ, డిసెంబరు 9 : కనగల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం సందర్శించారు. వంటగది, పాఠశాల పరిసరాలు, వంట పాత్రలు శుభ్రం చేసే ప్రదేశాన్ని పరిశీలించారు. కిచెన్, పాఠశాల అవరణలో పరిశుభ్రత లోపించడంపై పిన్సిపాల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెసిడెన్సియల్ పాఠశాలలు శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. పాఠశాలల్లో పారిశుధ్య లోపం, మధ్యాహ్న భోజనంలో పరిశుభ్రత, నాణ్యత లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా కేజీబీవీలో 230 మంది విద్యార్థులు ఉండగా 3వ తరగతి విధ్యార్ధులకు బెంచీలు లేకపోవడంతో కింద కూర్చోవడం గమనించిన కలెక్టర్ తక్షణమే బెంచీల ఏర్పాటు కోసం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్‌కు లేక రాయాలని ఆదేశించారు. దాంతోపాటు అదనపు గది నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాపించాలని తెలిపారు.
అనంతరం కనగల్ మండలానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జూనియర్ కళాశాలను మంజూరు చేయగా కళాశాల భవన నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. ముందుగా ఎస్ఎల్బీసీ ఆవరణలో ఉన్న తాసీల్దార్ కార్యాలయం చుట్టు పక్కల స్థలాన్ని, సర్వే నంబర్ 591లో కేజీబీవీ పక్కన స్థలాన్ని, 339 సర్వే నంబర్లో పల్లె ప్రకృతి వనం వద్ద స్థలాన్ని కలెక్టర పరిశీలించారు. ప్రభుత్వం గత వారం కనగల్, తిప్పర్తి మండలాలకు జూనియర్ కళాశాలలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. కనగల్ మండలంలో జూనియర్ కళాశాలతో పాటు ప్రతీక్ ఫౌండేషన్ సహకారంతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి స్థలాన్ని చూడాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. జూనియర్ కళాశాల, స్టేడియం నిర్మిణానికి 10 ఎకరాల స్థలం అవసరం ఉందన్నారు. ఆమె వెంట ఆర్డీఓ అశోక్‌రెడ్డి, తాసీల్దార్ పద్మ, ఎంపీఓ సుమలత,ఆర్ఐ, స్థానిక నాయకులు గోలి జగాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.