వేసవి సెలవుల తర్వాత బడులు గురువారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. విద్యార్థులంతా సెలవులకు టాటా చెప్పి బడికి పోయేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సర్కార్ బడులు సమస్యలతో స్వాగతం పలుకనున్నాయి. బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన ‘మన ఊరు- మనబడి’ పనుల పురోగతిలేదు. స్కూళ్లలో మౌలిక వసతులు లేవు. అనేక సమస్యలతో విద్యార్థులు నూతన విద్యా సంవత్సరం బడిలో అడుగుపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం, విద్యాశాఖ వైఫల్యంతో విద్యార్థుల సంఖ్యకు సరిపోయే యూనిఫామ్ క్లాత్ జిల్లాకు సరఫరా కాలేదు.
రామగిరి, జూన్ 11: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్య, నోట్, వర్క్ పుస్తకాలు, యూ నిఫామ్స్ జిల్లా విద్యాశాఖ సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా 1,606 ప్రాథమిక, ప్రాథమికోన్నత, 258 ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు 5,89,970 అవసరం ఉండగా 4,90,860 రావడంతో వాటిని మండలాల్లోని ఎంఆర్సీలకు, అక్కడి నుం చి పాఠశాలలకు చేరవేశారు. ఇంకా పుస్తకాలు జిల్లా కేంద్రానికి రావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.
ఒక జత యూనిఫామ్ దిక్కు…
రెండు జతల స్కూల్ యూనిఫామ్స్ ప్రతి విద్యార్థికీ అందజేయాలి. అందుకు 3,61,133 మీటర్ల క్లాత్ అవసరం ఉండగా జిల్లాకు 1,80,565 మీటర్లు రావడంతో దానితో ఒక జత మాత్రమే సిద్ధం చేస్తున్నారు. బడి ప్రారంభమైన రోజే ఇచ్చేందుకు శ్రీకారం చుట్టారు.
కొనసాగుతున్న బడిబాట …
జిల్లాలోని మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం ఎన్రోల్మెంట్ లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. దానిలో భాగంగా ఈనెల 6నుంచి 19వరకు ప్రత్యేక కార్యాచరణతో బడిబాట నిర్వహిస్త్తూ సీఆర్పీలు, ఉపాధ్యాయులు, హెచ్ఎంలు ఆయా ప్రాంతాల్లో ర్యాలీలు చేస్తూ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు.
కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి పేదవిద్యార్థికీ ఆంగ్లమాధ్యంలో చదువులు అందించేలా ‘మన ఊరు-మనబడి’ పథకం అందుబాటులోకి తెచ్చి మౌలిక వసతులకు శ్రీకారం చుట్టింది. జిల్లా వ్యాప్తం గా 517 పాఠశాలలు ఎంపిక చేశారు. వీటిలో 220 పాఠశాలల్లో మా త్రమే పనులు పూర్తి కాగా మిగిలినవి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలివేయడంతో పురోగతి లేక దర్శనమిస్తున్నాయి.
టీచర్ల సర్దుబాటు..
విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇబ్బందులు ఏర్పడకుండా ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేపట్టడంపై విద్యాశాఖ దృష్టి సారించింది. విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలల నుంచి ఎక్కువగా ఉన్న బడులకు సర్దుబాటు చేయనున్నారు. అయితే ఈనెల13లోపు ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సర్దుబాటు చేసిన ఉపాధ్యాయులు పాఠశాలల్లో చేరిన అనంతరం పూర్తి వివరాలతో కూడిన నివేదికను ఈ నెలాఖరు వరకు రాష్ట్ర విద్యాశాఖకు, జిల్లా విద్యాశాఖ పంపించాల్సి ఉంటుంది.
అయితే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తొలుత స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తారు. అక్కడ అవసరం లేకపోతే మండల పరిధిలో లేదంటే పక్క మండలాల్లో పరిశీలిస్తారు. ప్రభుత్వం, విద్యాశాఖ నిబంధనలు అశాస్త్రీయంగా ఉన్నాయని, ప్రక్రియ ఆపివేయాలని మెజారిటీ ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నా సర్కార్, విద్యాశాఖ మొండిగా ప్రక్రియను సాగిస్తుందన్న విమర్శలువస్తున్నాయి.
అవస్థల్లో ‘అమ్మ ఆదర్శ’పాఠశాలలు
జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ సర్కార్ 938 అమ్మ ఆదర్శ పాఠశాలలను ఎంపిక చేసింది. వీటిలో విద్యుత్ సౌకర్యం, తాగునీరు, మరమ్మతులు, టాయిలెట్లు అందుబాటులోకి తెచ్చి విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు. గతేడాది నుంచి ఇప్పటికి వరకు 438 పాఠశాలల్లో 100శాతం పనులు పూర్తి చేయగా మిగిలిన పాఠశాలల్లో 70 శాతం పనులు పూర్తి అయినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ పనులకు రూ.40.83కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉండగా 10.67 కోట్లు మాత్రమే జిల్లా అందగా వాటిని సంబంధిత నిర్మాణ రంగాలవారికి అందజేశారు. దీంతో నిధులలేమితో అమ్మ ఆదర్శ పాఠశాలలు వెలవెలబోతున్నాయని చెప్పవచ్చు.