రామగిరి, మే 13 : నల్లగొండ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వ గుర్తింపు, అనుమతి లేకుండా ఏర్పాటవుతున్నాయి. ఆకర్షణీయమైన బ్యానర్స్, వాల్ పోస్టర్లు వేసి పెద్ద ఎత్తున అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. కానీ జిల్లా విద్యాశాఖ అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పాఠశాలలకు గుర్తింపు లేదని ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు.
ఇప్పటికే జిల్లాలో ఎన్నో ప్రైవేట్ స్కూళ్లు ప్రభుత్వ గుర్తింపు లేకుండా వెలసినా బయటపడ్డవి కొన్ని మాత్రమేనని, అధికారులు తమ చేతివాటం ప్రదర్శించడంతో వెలుగులోకి రావడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారి బి. భిక్షపతి నల్లగొండ జిల్లాలో ఆరు ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వ గుర్తింపు లేదని, వాటిల్లో అడ్మిషన్లు చేయొద్దని ప్రకటన జారీ చేశారు.
శ్రీచైతన్య(హాలియా), శ్రీచైతన్య (దేవరకొండ), జయ హైస్కూల్ (రవీంద్రనగర్, నల్లగొండ), ఎలైట్ స్కూల్ (నల్లగొండ), లిటిల్ స్కాల ర్స్ హైస్కూల్ (నల్లగొండ), వేదాంత హైస్కూల్(రామగిరి, నల్లగొండ).
ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేటప్పుడు తల్లిదండ్రులు ఆ పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు ఉందా లేదా అని తెలుసుకోవాలి. గుర్తింపు లేకుండా పాఠశాలలను ఏర్పాటు చేసి అడ్మిషన్లు తీసుకుంటే నిబంధనలు మేరకు కఠిన చర్యలు ఉంటాయి.