సూర్యాపేట టౌన్/చివ్వెంల : యాదవుల కుల దైవంగా పేరొందిన దురాజ్‌పల్లి లింగమంతుల జాతర ఆదివారం రాత్రి ప్రారంభమైంది. మధ్యాహ్నం నుంచే భక్తులు బారులుదీరి పెద్దగట్టుకు చేరుకున్నారు. మొన్నటి వరకు నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రాంతం జనసంద్రంగా మారింది. కాళ్ల గజ్జల సవ్వడులు, భేరీ చప్పుళ్లు మధ్య జనం తరలివస్తుండగా లింగా.. ఓ లింగా స్మరణలు మార్మోగుతున్నాయి. ఆదివారం రాత్రి కేసారం గ్రామం నుంచి దేవరపెట్టె, బోనం గంపను మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ పూజలు చేశారు. అనంతరం పూజారులు, యాదవ పెద్దలు సంప్రదాయ బద్ధంగా గుట్టపైకి తీసుకొచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
దేవరపెట్టెలో ఉన్న దేవతామూర్తులను ఆలయంలో ప్రతిష్ఠించారు. సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. బోనాల గంపలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక రంగురంగుల విద్యుత్ దీపాలతో పెద్దగట్టు ఆలయం కళకళలాడుతున్నది. గట్టు ప్రాంతంలో వివిధ రకాల దుకాణాలు, ఎగ్జిబిషన్లు, జెయింట్ వీల్స్, సర్కస్లతో సందడి నెలకొంది. భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాల అధికారులు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. జాతర సందర్భంగా సోమవారం నల్లగొండ, సూర్యాపేట జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఆయా కలెక్టర్లు సెలవు ప్రకటించారు.