సూర్యాపేట టౌన్, ఆగస్టు 7 : పేదలకు మెరుగైన వైద్యం అందించాల్సిన సూర్యాపేట ప్రభుత్వ దవాఖానలో నిర్వహణ లోపం కొట్ట్టొచ్చినట్లు కనిపిస్తుంది. నిత్యం రోగులతో కిటకిటలాడే ప్రభుత్వ దవాఖానలో ఐదు రోజుల నుంచి స్కానింగ్ సెంటర్ సేవలు నిలిచిపోయాయి. స్కానింగ్ సెంటర్ నిర్వహించాల్సిన రేడియాలజిస్ట్‌లు అందుబాటులో లేకపోవడంతో రోగులు నానాయాతనలు పడుతున్నారు. డాక్టర్లు తమ వద్దకు వచ్చిన రోగులకు వైద్య పరీక్షల కోసం స్కానింగ్ సెంటర్‌కి వెళితే అక్కడ ఒక్క రేడియాలజిస్టు లేకపోవడంతో అవాక్కవుతున్నారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. బీఆర్ఎస్ ప్రభుత్వం కొట్లాది రూపాయలు వెచ్చించి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని మిషనరీలను సమకూర్చింది. ప్రైవేట్ దవాఖానకు దీటుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోగా ప్రస్తుతం వాటిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. స్కానింగ్ సెంటర్లో రేడియోలజిస్టులు లేక పోవడంతో వైద్యం ఎలా చేయించుకోవాలని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ స్కా నింగ్ సెంటర్లో వాస్తవంగా ముగ్గురు రేడియాలజిస్టులు ఉండాల్సి ఉండగా వీరిలో ఇద్దరు తమకు ఈ ఉద్యోగం వద్దని వెళ్లిపోయారు.
మిగిలిన ఒక రేడియాలజిస్టు చేయివిరగడంతో సెలవులో ఉన్నారు. దీంతో స్కానింగ్ సెం టర్ ఐదు రోజులుగా సేవలు అందించడమే లేదు. ఇన్ని రోజులుగా రోగులు ఇబ్బందులకు గురవుతున్నా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిన దవాఖాన నిర్వాహకులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ప్రభుత్వ దవాఖానలో ఆకస్మిక తనిఖీ చేయగా వైద్యులు, సిబ్బంది సకాలంలో హాజరుకాకపోవడం, కొంత మంది వైద్యులు డుమ్మా కొట్టడంపై అసహనం వ్యక్తం చేసి ఆగ్రహించారు. కలెక్టర్ తనిఖీ చేసిన రెండు రోజులకే ప్రభుత్వ దవాఖానలో రోగులు, వృద్ధులను, పైఅంతస్తులకు తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోవడంతో అందులో ఇరుక్కున్న వారి ఆహకారాలతో దవాఖానలో గందరగోళ పరిస్థితి నెలకొంది. చివరకు పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది వచ్చి బయటకు తీశారు. లిప్ట్ నిర్వహణ కోసం నిత్యం దవాఖానలో ఒక టెక్నీషియన్‌ను ఏర్పాటు చేసుకోవాలనే కనీస ఆలోచన నిర్వాహకులకు లోపించిందని ప్రజలు మండిపడుతున్నారు. ఇకనైనా నిర్వాహకులు స్పందించి రేడియాలజిస్టులను నియమించి స్కానింగ్ సెంటర్‌ను వినియోగంలోకి తేవాలని, లిప్ట్ టెక్నీషియన్‌ను ఏర్పాటు చేసి దవాఖానపై ప్రజల్లో విశ్వాసం కలిగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఉన్న వసతులు కాంగ్రెస్ పాలనలో లేవన్నారు.
భుజానికి దెబ్బ తగిలితే వైద్యం కోసం దవాఖానకు వచ్చిన. డాక్టర్ స్కానింగ్ చేయించుకోమని 23వ నెంబర్ రూమ్‌కు వెళ్లమన్నారు. ఇక్కడకు వస్తే ఎవ్వరూ లేరు. ఏం చేయాలో అర్ధం కావడం లేదు. బయట చేయించుకునే శక్తి లేదు. దవాఖానలోనే స్కానింగ్ చేసి మందులిస్తే బగుంటది.
నాకు ఆరోగ్యం బాగోలేదు. ప్రైవేట్ దవాఖానలో వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేక..ప్రభుత్వ దవాఖాన లో డాక్టర్లకు చూపించుకోవాలని వచ్చిన. డాక్టర్ చూసి పరీక్షలకు రాస్తే ఇక్కడ పరీక్షలు చేసే డాక్టర్ లేదు. నేను రావులపెంట నుంచి కుటుంబంలోని ముగ్గురం వచ్చాం. దవాఖానలో ఇట్లా చేస్తే ఎట్లా మేము ఎక్కడ చూపించాలో..ఎవరిక చెప్పాలో అర్ధం కావడం లేదు.
రేడియాలజిస్టుల కొరతతో ఐదు రోజులుగా ద వాఖానలో స్కానింగ్ సేవలు నిలిచిపోయింది వాస్తవమే. ఈ విషయంపై కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌కు విన్నవించడంతో వారి ఆదేశాల మేరకు బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తాం. కొత్తగా రేడియాలజిస్టుల నియామకం చేపట్టి గురువారం నుంచి స్కానింగ్ సెంటర్లో సేవలు అందుబాటులోకి తీసుకువస్తాం.