మునగాల, జులై 07 : కాంగ్రెస్ ప్రజా పాలనలో రాష్ట్రంలో పారిశుధ్యం పడకేసిందని మాజీ జడ్పీటీసీ కోలా ఉపేందర్‌రావు అన్నారు. సోమవారం ఆయన స్పందిస్తూ.. మునగాల మండల పరిధిలోని తాడువాయి గ్రామంలో పారిశుధ్యం పనులు పట్టించుకునే నాధుడే కరురయ్యారని, చిన్నవానకే రోడ్లు బురదమయమై నడవలేని స్థితిలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అధికారులు మాత్రం కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది సైతం వానాకాలం సీజన్లో పారిశుధ్య పనులు పట్టించుకోకపోడంతో గ్రామంలో డయేరియా, చికెన్‌గున్యా, డెంగ్యూ వంటి విష జ్వరాలు విజృంభించి ప్రజలు రోగాలబారిన పడి లక్షల రూపాయలు ఆస్పత్రులకు పెట్టి తమ ప్రాణాలను కాపాడుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది అదే దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైనేజీ సక్రమంగా లేకపోవడంతో రోడ్లపైకి మురుగు నీళ్లు వచ్చి దుర్గందాన్ని వెదజల్లుతుందన్నారు. తాడువాయి గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా తీసుకుని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారు గాని మురుగు కాల్వలు నిర్మించడం మరిచారని పేర్కొన్నారు.