రామగిరి, డిసెంబర్ 18 : విద్యాశాఖలో పాఠశాల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమగ్ర శిక్షలో వివిధ హోదాల్లో కీలక భూమిక పోషిస్తున్న ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసన దీక్షలు బుధవారానికి 9వ రోజుకు చేరాయి. గతంలో సమ్మె చేస్తున్న సమయంలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీ ఏమైందని, అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయారా? అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫొటో ప్లకార్డులతో ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించారు. సమ్మెకు బీజీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు పీఆర్టీయూ అర్బన్ శాఖ అధ్యక్షుడు శంకరయ్య, పలు సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమగ్ర శిక్ష విభాగంలో పని చేస్తున్న 2,192 మంది ఉద్యోగులు సమ్మెలో ఉండడంతో ఎమ్మార్సీలు, భవిత సెంటర్స్ తలుపులు తెర్చుకోక తాళాలతో దర్శనమిస్తున్నాయి. మరో వైపు కేజీబీవీలో విద్యార్థులకు బోధన సాగడంలేదు. పాఠశాల స్థాయి నుంచి పూర్తి సమాచారం సేకరించే సీఆర్పీలు, జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్షలో పనిచేసే ఉద్యోగులంతా సమ్మెలో ఉండటంటో విద్యాశాఖ కార్యక్రమాలు కుంటుపడుతున్నాయని చెప్పవచ్చు. కాంగ్రెస్ తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రోజుల తరబడి సమ్మె చేస్తున్నా రేవంత్‌రెడ్డి సర్కార్ స్పందించడం లేదని, సమస్యలు పరిష్కరించే వరకూ ఆందోళన కొసాగిస్తామని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు.
కాంప్లెక్ స్థాయిలో విద్యా కార్యక్రమాలను పాఠశాలలకు, ఎమ్మార్సీలకు.. అక్కడి నుంచి డీఈఓ కార్యాలయానికి చేరవేసే క్లస్టర్ రీసోర్స్‌పర్సన్స్ సమ్మెలో కొనసాగుతుండంతో విద్యాశాఖ అమలు చేస్తున్న సమాచారం పాఠశాలలకు చేరడం లేదు. జిల్లా కార్యాలయంలో పనిచేస్తున్న ఏపీఓ, అకౌంటెంట్స్తోపాటు కేజీబీవీలో టీచర్స్, పాఠశాలలో పనిచేసే పార్ట్‌టైం టీచర్స్ విధులకు హాజరుకాకపోవడంతో ఈ ప్రభావం త్వరలో జరుగబోయే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలపై ప్రభావం పడనుంది. నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 59 ఉన్న కేజీబీవీల్లో పనిచేసే ప్రత్యేకాధికారులు(ఎస్ఓ), టీచర్స్, బోధననేతర సిబ్బంది 691 మంది సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో ఆయా పాఠశాలలో 9 రోజులుగా పాఠ్యాంశాల బోధన నిలిచిపోయింది. కేవలం రోజూ ఒక టీచర్, పీఈటీ, ఏఎన్ఎంలు విధులు నిర్వహిస్తుండగా, వంట సిబ్బంది వంట చేసి పెడుతున్నారు. దీంతో ఆయా పాఠశాలల్లోని 7వేలకుపైగా విద్యార్థులంతా హాస్టల్ గదులకే పరిమితమయ్యారు. ఇక ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సేవలందించే ఐఈఆర్పీలు, ఉమ్మడి జిల్లాలోని 100 భవిత సెంటర్స్ మూతపడటతో 8వేలకు మందికిపైగా విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది.
సమగ్రశిక్ష ఉద్యోగులు చాలీచాలని జీతాలతో జీవితం గడుపుతున్నారు. తాము సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా బాధాకరంగా ఉంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లుపెట్టి ఆమోదించాలి. మంత్రులు సైతం మా సమస్యలపై మాట్లాడాలని వేడుకుంటున్నాం. సమస్యలు పరిష్కరించే వరకు ఐక్యంగా ఉండి సమ్మె కొనసాగిస్తాం.
– మొలుగురి కృష్ణ, సమగ్రశిక్ష ఉద్యోగులు సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు
సమగ్ర శిక్ష ఉద్యోగులంతా సమ్మెలో ఉండడంతో విధులకు హాజరుకావడం లేదు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా జిల్లా విద్యాశాఖ- సమగ్రశిక్షలో విధులు నిర్వహిస్తున్నాం. ఒడిశా, మహారాష్ట్ర, హర్యానాలో మా లాంటి ఉద్యోగులను అక్కడి ప్రభుత్వాలు క్రమబద్ధీకరించాయి. అక్కడి మాదిరిగా రెగ్యులర్ చేసి మా కుటుంబాల్లో వెలుగులు నింపాలి.
– భిక్షమా చారి, అకౌంటెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్, సమగ్రశిక్ష జిల్లా కార్యాలయం
గురుకులాల్లో పనిచేసే ప్రిన్సిపాల్స్‌తో సమానంగా కేజీబీవీల్లో పనిచేస్తున్నాం. మా సర్వీసులు రెగ్యులర్ చేయాలి. కేజీబీవీలో పనిచేస్తున్న ప్రత్యేకాధికారులకు(ఎస్ఓ) ప్రిన్సిపాల్‌గా హోదా కల్పించాలి. సమ్మెలో ఉన్నప్పటికీ మా పాఠశాలలో ఉండే విద్యార్థులకు రక్షణ కల్పిస్తూనే భోజనం, వసతులు కల్పిస్తున్నాం. మరో వైపు మోడల్ స్కూల్ హాస్టళ్లకు ఇన్‌చార్జీలుగా వ్యహరిస్తూ వారికి కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు పర్యవేక్షిస్తున్నాం. కానీ సమాన పనికి సమాన వేతనం, హోదా అందించడంలేదు. ఇది చాలా అన్యాయం. మాపై దయతో ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలి.
– డి.విజయశ్రీ, ఎస్ఓ, కేజీబీవీ, గుర్రంపోడు
ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో బోధన సిబ్బంది మాదిరిగానే మేము 24 గంటలు విధుల్లో ఉంటున్నాం. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నాం. చేసే పని కొండంతా, ఇచ్చే నెల జీతం మాత్రం గోరంత. వెట్టిచాకిరి చేయించుకుంటున్న ప్రభుత్వానికి ఇది తగదు. మహిళలు మా ఆడబ్డిలంటూనే ఆ మహిళా ఉద్యోగులనే సర్కార్ పట్టించుకోకపోవడం చాలా బాధాకరం.
– బి.సుజాత, పీఈటీ, కేజీబీవీ కట్టంగూర్
సమగ్ర శిక్షలో ఐఈఆర్పీ టీచర్స్‌గా పనిచేస్తున్నాం. ఏండ్ల తరబడి పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నా సర్కార్ పట్టించుకోవడంలేదు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నాం. వారికిస్తున్న లక్షల వేతనాలు కాకపోయినా మాకు కనీస వేతనాలు కూడా ఇవ్వరా..? ఇంత దారుణంగా వెట్టిచాకిరీ చేయించుకుంటారా? ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలి. లేకుంటే ఐక్యంగా ఉంటూ సమ్మెలోనే కొనసాగుతాం.
– కంచర్ల ప్రమీళ, ఐఈఆర్పీ, సమగ్ర శిక్ష, చండూర్ మండలం