శాలిగౌరారం, ఫిబ్రవరి 21 : సమైక్యాంధ్ర పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ యార్డ్ నేడు స్వరాష్ట్రంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ సహకారంతో అభివృద్ధి వైపు అడుగులేస్తుంది. ఒకప్పుడు మార్కెట్లో ధాన్యం విక్రయించేందుకు వచ్చిన రైతులకు సరైన సౌకర్యాలు లేక నానా ఇబ్బందులు పడేవారు. నేడు అన్ని వసతులతో పాటు గిట్టుబాటు ధర కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. 8 ఎకరాల 6 గుంటల్లో మార్కెట్ విస్తరించి ఉంది. మార్కెట్ ఆవరణలో 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసుకునేందుకు వీలుగా అదనపు గోదాములను సైతం ప్రభుత్వం నిర్మించింది. అలాగే ధాన్యాన్ని ఆరబోసుకునేందుకు సీసీ నిర్మించి రైతుల ఇబ్బందులను తొలగించింది.
నకిరేకల్ వ్యవసాయ మార్కెట్‌కు సబ్ మార్కెట్ యార్డ్‌గా ఉన్న శాలిగౌరారం మార్కెట్ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2018లో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ప్రత్యేక చొరవతో నకిరేకల్ నుంచి వీడి శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్‌గా అవతరించింది. నాటి నుంచి మార్కెట్‌కు పాలకవర్గం ఏర్పాటు చేసి రైతులను కష్టాల కడలి నుంచి విముక్తి చేసింది.
శాలిగౌరారం మార్కెట్ యార్డ్‌లో రైతులకు, పాలక వర్గానికి మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుతూ ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ పలు అభివృద్ధి పనుల విషయమై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మార్కెట్ ఆవరణలో నూతన కార్యాలయం ఏర్పాటు కోసం రూ.46 లక్షలు, ప్రహరి నిర్మాణం, వాటర్‌కు రూ.5 లక్షలు, శిథిల రేకుల మరమ్మతులకు రూ.5 లక్షల నిధులు, పచ్చదనం, పరిశుభ్రత, బోరు మోటారు ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపారు.
ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ సహకారంతో శాలిగౌరారం మార్కెట్‌యార్డ్‌ను అన్ని విధాల అభివృద్ధి పరుస్తా. మార్కెట్లో రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తూ రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తా. ఆదర్శ మార్కెట్ యార్డ్‌గా తీర్చిదిద్దుతా. ఎమ్మెల్యే ఆశీస్సులు, అధికారుల సమన్వయంతో మార్కెట్‌ను అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తా.
-మామిడి తేజస్వి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్, శాలిగౌరారం.