ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించే లక్ష్యంతో మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇది విజయవంతంగా అమలైంది. మిషన్ భగీరథ సిబ్బందికి ప్రతి నెలా సకాలంలో జీతాలు అందించింది. ఎక్కడా నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తలేదు. కానీ కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మిషన్ భగీరథ నిర్వహణ గాడి తప్పింది. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి వేతనాలు ఇవ్వకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. అనేక గ్రామాలకు తాగు నీటి సరఫరా సక్రమంగా కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వేతనాలు అందక అవస్థలు
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని అవంతీపురం వద్ద ఉన్న మిషన్ భగీరథ ప్లాంట్ నుంచి సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గాల్లోని గ్రామాలకు మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నారు. దీని కోసం వాల్ ఆపరేటర్లు, ఫిట్టర్లు, సూపరవైజర్లు ఇలా సుమారు 400 మంది క్షేత్రస్థాయిలో సిబ్బంది పని చేస్తున్నారు. వీరికి రూ.10 వేల నుంచి రూ.15వేల వరకు వేతనాలుంటాయి. కానీ జూన్, జూలై, ఆగస్టు నెలల జీతాలను ప్రభుత్వం ఇవ్వలేదు. ప్రస్తుతం నాలుగో నెల కూడా జీతాలు రాలేదు. జీతాలు లేక ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నామని, అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జీతాలు రాక అష్టకష్టాలు పడుతున్నం
మాకు నాలుగు నెలలు నుంచి జీతాలు రావట్లేదు. రాత్రీపగలు పని చేసి తాగు నీటి సరఫరాలో ఇబ్బందుల్లేకుండా చూస్తున్నం. ఇంత కష్టపడ్డా ఫలితం లేదు. కుటుంబ పోషణకు అష్టకష్టాలు పడుతున్నం. ఇకనైనా సర్కారు స్పందించి సకాలంలో జీతాలు ఇవ్వాలి.
-సందీప్ రెడ్డి, మిషన్ భగీరథ సూపర్వైజర్
అసలే జీతాలు తక్కువ
అవంతీపురంలోని మిషన్ భగీరథ ప్లాంటు నుంచి నాలుగు నియోజకవర్గాలకు నీటిని సరఫరా చేయడం కోసం సుమారు 400 మంది సిబ్బంది పని చేస్తున్నారు. మాకు ఇచ్చే జీతం కూడా చాలా తక్కువే. ఆ డబ్బులు కూడా నెల నెలా ఇవ్వడం లేదు. నాలుగు నెలలుగా అవస్థలు పడుతున్నాం. ప్రభుత్వం చొరవ తీసుకొని మా వేతనాలు విడుదల చేయాలి.
-రవి, మిషన్ భగీరథ లైన్మన్