నీలగిరి, ఏప్రిల్ 17 : ఇంటా, బయట వేధింపులు.. లైంగిక దాడులు, ఇతర సామాజిక సమస్యలతో బాధపడే మహిళలకు జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రం అండగా నిలుస్తున్నది. పసి పాప నుంచి 60 ఏండ్ల వృద్ధురాలి వరకు సమస్యల్లో చికుకున్న వారిని మేమున్నామంటూ అకున చేర్చుకుంటున్నది. అవసరమైన వారికి ఆరు రకాల సేవలు అందించడంతోపాటు ప్రత్యేకమైన వసతి కల్పిస్తున్నది. జిల్లాలో ఇప్పటి వరకు 7,209 మందికి అండగా నిలిచి 5,107 మంది సమస్యలను పరిష్కరించింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 181 టోల్ నెంబర్, హెల్ప్ ద్వారా 159 ఫిర్యాదులు సేకరించి వాటిని పరిష్కరించి బాధితులకు అండగా నిలబడింది.
మహిళా సంరక్షణే ధ్యేయంగా జిల్లా యంత్రాంగం, న్యాయ, మహిళా, శిశు సంక్షేమం, పోలీస్ శాఖల సమన్వయంతో గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్ సంయుక్తంగా 2017 డిసెంబర్ సఖి సెంటర్ (వన్ స్టాప్ సెంటర్)ను ఏర్పాటు చేశారు. ఇది 24 గంటలపాటు అందుబాటులో ఉంటూ బాధిత మహిళలకు అండగా నిలుస్తున్నది. స్త్రీలు ప్రధానంగా ఎదుర్కొనే వేధింపులు, గృహహింస, వరకట్న సమస్యలు, అక్రమ రవాణా, ఈవ్ లైంగికదాడులు వంటి అన్ని సమస్యలను పరి-ష్కరించేందుకు సఖి కేంద్రం కృషి చేస్తున్నది.
మూడు లక్ష్యాలు.. ఆరు రకాల సేవలు
సఖి కేంద్రంలో సలహా, సాంత్వన, రక్షణ అనే లక్ష్యాలతోపాటు కౌన్సెలింగ్, న్యాయ సేవలు/ కేసు నమోదు, పోలీస్ సహాయం, వైద్య సేవలు, తాత్కాలిక వసతి, వీడియో కాన్ఫరెన్స్ వంటి సేవలు అందిస్తున్నారు. బాధిత మహిళలకు మానసిక, సామాజిక కౌన్సిలర్ల ద్వారా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. జిల్లా న్యాయ సేవా సంస్థ వారు సఖి కేంద్రం న్యాయవాది ద్వారా ఉచిత న్యాయ సలహా, ప్రాథమిక నివేదికను పంపుటకు పోలీస్ అధికారులు సహాయం చేస్తారు. అంబులెన్స్, ఎంపిక చేయబడిన నర్సుల ద్వారా వైద్య సదుపాయం, ప్రభుత్వ వైద్యశాలల ద్వారా జిల్లా ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు.
సఖి సేవలపై విస్తృత ప్రచారం
గ్రామాలు, పట్టణాల్లో వేధింపులు, అఘాయిత్యాలు, లైంగిక దాడులకు గురైన మహిళలు ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి సఖి కేంద్రం అండగా ఉంటుందనే విషయంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 268 సభలు, సమావేశాలు, సదస్సులు నిర్వహించి 25,400 మంది మహిళలకు, 16,922 మంది పురుషులు.. మొత్తంగా 42,322 మందికి అవగాహన కల్పించారు. పాఠశాలలు, కళాశాలలు, ఆరోగ్య కేంద్రాలు, మండల, జిల్లా సమాఖ్యలు, మహిళలు ఉండే ప్రతి చోటా అవగాహన కల్పిస్తున్నారు.
ఫిర్యాదులకు 181 టోల్ నెంబర్
బాధితులు టోల్ ఫ్రీ నెంబర్ 181కి ఫోన్ చేసి సమాచారం అందిస్తే తక్షణమే స్పందిస్తుంది. దీంతోపాటు హెల్ప్ పేరుతో ప్రత్యేకంగా ల్యాండ్ లైన్ నెంబర్ 08682-234088ను కూడా ఏర్పాటు చేశారు. నిర్వాహకులు 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తున్నారు. బాధితురాలు అందించిన వివరాలను 181, హెల్ప్ ప్రతినిధులు నమోదు చేసుకొని వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ తెలియజేసి రక్షణ కల్పిస్తారు. నిందితుడిని విచారణ చేసి అతని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఇస్తారు. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతారు. గృహహింస, లైంగిక, వరకట్న వేధింపులు, అక్రమ రవాణా, ఈవ్ తదితర సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలు ఈ నెంబర్ ఫోన్ చేసి ఆశ్రయం, సహాయం పొందవచ్చు.
వృద్ధులు, ఒంటరి మహిళలకు అండగా..
వృద్ధాప్యంలో ఇంటి నుంచి గెంటివేయబడిన, ఏ దిక్కులేని ఒంటరి మహిళల సమస్యలను ఈ హెల్ప్ ద్వారా పరిష్కరి-స్తారు. బాధితురాలు అందించిన వివరాలతో అధికారులు స్వయంగా వారి ఇంటికి వెళ్లి విచారిస్తారు. వృద్ధ మహిళల కోరిక మేరకు వారికి నివాసం కల్పించడం, కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇవ్వడం, ఏ ఆధారం లేకపోతే వృద్ధాశ్రమంలో చేర్పిం-చడం వంటివి చేపడుతారు. ఒంటరి మహిళలకు పింఛన్ అందించడం, జీవనోపాధి కోసం రుణాలు కల్పించడం, కుటుంబ సమస్యలను పరిష్కరించడం వంటివి చేస్తారు.
బాధితులకు మహిళా కిట్
సఖి కేంద్రానికి వచ్చిన బాధితులకు కేసీఆర్ కిట్ మాదిరిగా 9 రకాల వస్తువులతో మహిళా కిట్ అందించి ఐదు రోజులపాటు వసతి కూడా కల్పిస్తున్నారు. ఈ కిట్ రెండు జతల దుస్తులు, ఒక జత చెప్పులు, దువ్వెన, కొబ్బరి నూనె, పౌడర్, బొట్టు బిల్లలు, రెండు సబ్బులు తదితర వస్తువులు ఉంటాయి. ఇక్కడ ఐదు నుంచి వారం రోజుల పాటు ఆశ్రయం కల్పించి తదుపరి వారి నిర్ణయం ప్రకారం కుటుంబీకులకు అప్పగించడం లేదా ఇతర సెంటర్లలో ఉంచి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం చేస్తారు.
వైద్యం : గృహహింస ఇతర వేధింపుల్లో గాయాలకు గురైతే ఆసుపత్రిలో చేర్పించి వైద్య సాయం అందిస్తారు.
సైకో సోషల్ కౌన్సెలింగ్ : బాధితురాలి విన్నపం మేరకు నిందితులకు కౌన్సెలింగ్ ఇచ్చి సమస్య పరిష్కరిస్తారు.
పోలీసుల సాయం : హింసకు గురై బాధపడుతూ సఖి కేంద్రానికి రాలేని స్థితిలో ఉన్న మహిళలకు పోలీసు రక్షణ ఇస్తారు.
వసతి : బాధితురాలి విన్నపం మేరకు ఒకటి నుంచి ఐదు రోజుల వరకు సఖి కేంద్రంలో ఉచితంగా వసతి కల్పిస్తారు.
వీడియో కాన్ఫరెన్స్ : బాధితురాలికి సఖి కేంద్రం నుంచి బంధువులతో లేదాలేదా శ్రేయోభిలాషులతో మాట్లాడడానికి వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పిస్తారు.
న్యాయ సలహాలు : న్యాయ సేవా సంస్థ, సఖి కేంద్రం న్యాయవాది ద్వారా ఉచిత న్యాయ సలహా అందిస్తారు.
సఖి కేంద్రంలో అన్ని రకాల సేవలు
జిల్లాలో ఏ రకమైన హింసకు గురైనా బాధిత మహిళలకు సఖి కేంద్రం ద్వారా అన్ని రకాల సేవలు అందిస్తున్నాం. బాధితులకు సైకాలజీ, లీగల్ కౌన్సెలింగ్, పోలీస్, న్యాయ, వైద్య సేవలు కూడా ఇక్కడి నుంచి అందించడం జరుగుతుంది. బాధిత మహిళలు ఉండడానికి ఆశ్రయం కల్పించడంతోపాటు మహిళా కిట్ కూడా అందిస్తున్నాం. అనంతరం వారిని కుటుంబీకులకు అప్పగించడం లేదా ఇతర సెంటర్లలో ఉంచి వారికి ఆసక్తి ఉన్న రంగంలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నాం.
– సి.సుభద్ర, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి, నల్లగొండ
బాధిత మహిళలకు తోడ్పాటు
జిల్లాలోని వివిధ రంగాల మహిళలు సఖి కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవచ్చు. బాధితులు ఎవరైనా అండగా ఉంటాం. జిల్లా వాసులకు ఇప్పటి వరకు 258 అవగాహన సదస్సులు, సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాం. వరకట్న వేధింపులు, లైంగిక దాడులకు గురైనవారు, వ్యభిచార కొంపలో మగ్గుతున్న వారికి, నిరాదరణ గురైన మహిళలకు సఖి కేంద్రం అండగా నిలుస్తున్నది.
– మునగాల సునీత, కౌన్సిలర్ సఖి కేంద్రం, నల్లగొండ