మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే జాన్‌పహాడ్ దర్గా ఉర్సు నేటి నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 28 వరకు మూడు రోజులపాటు జరుగనున్న ఉత్సవాలకు అధికారులు, దర్గా నిర్వాహకులు అన్నిఏర్పాట్లు చేశారు. దర్గాకు రంగులు వేసి విద్యుద్దీపాలతో ముస్తాబు చేశారు. ఉర్సులో తొలిరోజు గురువారం గుసూల్ షరీఫ్ కార్యక్రమం నిర్వహిస్తారు. సైదులు బాబా, సిపాయిల సమాధులను శుభ్రం చేసి చాదర్ కప్పి దట్టీలు, పూలతో అలంకరించి కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేస్తారు. తెలంగాణ నలుమూలలతోపాటు ఏపీ నుంచి కూడా భక్తులు రానుండడంతో పటిష్ట బందోబస్తు నిర్వహించనున్నారు. ప్రతి అరగంటకు ఒక బస్సు నడిచే విధంగా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారు.
– పాలకవీడు, జనవరి25
పాలకవీడు, జనవరి 25 : మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే జాన్‌పహాడ్ దర్గా ఉర్సు గురువారం నుంచి ప్రారంభం కానున్నది. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు మన రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. అందుకు తగినట్లుగా అధికారులు, దర్గా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సంవత్సరం సుమారు లక్షమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మహోత్సవానికి లక్ష మంది భక్తులు హజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఉర్సునిర్వహణకు అధిక నిధులు
జాన్‌పహాడ్ ఉర్సుకు వచ్చే భక్తుల కోసం దర్గావద్ద ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం మొదటగా రూ.8లక్షలు విడుదల చేసింది. హుజుర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సీఎం కేసీఆర్‌ను కలిసి ఉర్సు కోసం మరిన్ని నిధులు ఇవ్వాలని కోరగా ఆయన స్పందించి మరో రూ. 50 లక్షల ప్రత్యేక నిధులు విడుదల చేశారు. ఈ నిధులతో భక్తుల సౌకర్యార్ధం మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రత్యేకాలంకరణ
మూడు రోజులపాటు జరిగే సైదన్న ఉర్సు ఉత్సవాలకు దర్గాను సుందరంగా అలంకరించారు. దర్గా పరిసరాల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేశారు. భక్తుల రాక కూడా ప్రారంభం కావడంతో సందడి మొదలైంది.
నేడు గుసూల్ ఫరీఫ్
గురువారం గుసూల్ షరీఫ్ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రాంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం సైదులు బాబా సమాదుల పైన, దర్గా పరిసరాల్లో ఉండే సిపాయిల సమాధులపై ఉన్న చాదర్లను తొలగించి వాటిని శుభ్రం చేసి కొత్తవాటిని వేస్తారు. సమాధుల చుట్టూ కొవ్వొత్తులు వెలిగించి పత్య్రేక ప్రార్థనలు నిర్వహిస్తారు. సైదులు బాబా సమాధిపై దట్టీలను ఉంచి పూలతో అలంకరించి ఉర్సు ఉత్సవాలు ప్రారంభిస్తారు.
శుక్రవారం గంధం మహోత్సవం
ఉర్సులో ప్రధాన ఘట్టమైన గంధం మహోత్సవం ఈ నెల 27న నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గంధం కలషానికి ప్రత్యేక పూజలు నిర్వహించి చందల్‌ఖానాకు ఊరేగింపుగా వెళ్తారు. వక్ఫ్‌బోర్డు వారు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన గంధం అందులో ఉంచి జాన్‌పహాడ్ గ్రామంలో ఊరేగిస్తూ దర్గా వద్దకు తీసుకు వస్తారు. పవిత్ర గంధాన్ని బాబా సమాదులపై ఉంచి ప్రత్కేక ప్రార్ధనలు నిర్వహిస్తారు. ఆ సమయంలో గంధాన్ని తాకితే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. శనివారం సాయంత్రం దీపారాధనతో ఉర్సు ఉత్సవాలను ముగిస్తారు.
ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
ఉర్సు ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ డిపోల నుంచి ప్రతి అరగంటకు ఒక ప్రత్యేక బస్సును నడుపనున్నారు. మిర్యాలగూడ డిపో నుంచి 10 బస్సులను దామరచర్ల మీదుగా జాన్‌పహాడ్ దర్గాకు, సూర్యాపేట డిపో నుంచి 5 బస్సులు, కోదాడ డిపో నుంచి 15 బస్సులను నేరేడుచర్ల మీదుగా దర్గా వరకు నడుపుతున్నట్లు ఆయా డిపో మేనేజర్లు తెలిపారు.
భారీ బందోబస్తు
ఉర్సు ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. కోదాడ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో 410 మంది సిబ్బందితో పటిష ్టబందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. బందోబస్తులో డీఎస్పీతో పాటు ఐదుగురు సీఐలు, 30 మంది ఎస్ఐలు, 350 మంది కానిస్టేబుల్స్, ప్రత్యేక పోలీసులు, హోంగార్డులతో పాటు రోప్‌వే సిబ్బందిని నియమించారు. దర్గా పరిసర ప్రాంతాల్లో, దర్గా ఎదుట, లోపల ప్రత్యేక క్యూలైన్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ రామలింగారెడ్డి తెలిపారు. శూన్యపహాడ్ రహదారి వెంట 5 ఎకరాల్లో, జాన్‌పహాడ్ రోడ్డు పెట్రోల్ బంక్ వద్ద 13 ఎకరాల్లో వేరువేరుగా పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఏర్పాట్లు పూర్తి
దర్గా వద్దకు వచ్చే భక్తుల కోసం రెవెన్యూ, గ్రామ పంచాయతీ సిబ్బందితో పాటు, దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. వైద్యఆరోగ్య, పోలీస్, అగ్నిమాపక, ఎక్సైజ్ శాఖ, 108 సిబ్బంది ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. హుజుర్నగర్ ఆర్డీఓ వెంకారెడ్డి అధికారులతో నిరంతరం సమీక్షిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దర్గా వద్ద పారిశ్యుద్ధ్య పనుల కోసం 3 షిఫ్ట్టుల ద్వారా 22 మంది గ్రామపంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షలో 200 మంది సిబ్బంది పని చేయనున్నారు. 40 తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు చేయడంతో పాటు 4 ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు ఎంపీడీఓ వెంకటాచారి తెలిపారు. నేరేడుచర్ల, పెంచికల్‌దిన్న పీహెచ్‌సీల ఆధ్వర్యంలో 40 మంది సిబ్బందితో మూడు ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు మండల వైద్యాధికారులు తెలిపారు