నేరేడుచర్ల/పెన్‌పహాడ్, ఏప్రిల్ 3 : సూర్యాపేట జిల్లాతోపాటు ఖమ్మం జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణ కోసం ప్రభుత్వం సాగర్ జలాలు విడుదల చేసినట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ తెలిపారు. నేరేడుచర్ల మండలం దాచారం వద్ద, పెన్‌పహాడ్ మండలం అన్నారం బ్రిడ్జి వద్ద బుధవారం నాగార్జున సాగర్ ఎడమ కాల్వలో ప్రవహిస్తున్న నీటిని అదనపు ఎస్పీ మేకల నాగేశ్వర్రావు, ఎన్ఎస్పీ అధికారులతో కలిసి పరిశీలించారు. సాగర్ జలాలను మోటర్ల ద్వారా పంపింగ్ చేయకుండా రైతులు, ప్రజలకు తమ సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ఇందుకోసం 126మంది సిబ్బందితో 26 టీములను ఏర్పాటు చేసి 24 గంటలు కాల్వ గట్ల వెంబడి పర్యవేక్షణ చేయిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కాల్వలో కొందరు రైతులు మోటర్లు పెట్టి వాడుకుంటున్నారని, అవి నడువకుండా విద్యుత్ సరాఫరా నిలిపి వేశామని చెప్పారు. ఈ జలాలు పాలేరుకు చేరితే సూర్యాపేట జిల్లాలో మరో మూడు నెలల పాటు 392 ఆవాసాలు, 192 గ్రామాలు, మరో రెండు మున్సిపాలిటీలకు తాగునీటికి ఇబ్బందులు ఉండవని తెలిపారు. ఆయన వెంట ఎన్ఎస్పీడీఈ అమరేందర్‌రెడ్డి, పెన్‌పహాడ్ తాసీల్దార్ మహేందర్‌రెడ్డి, ఎస్ఐ రవీందర్, ఆర్ఐ మట్టయ్య, కార్యదర్శి దివ్యభారతి ఉన్నారు.
కలెక్టర్ హరిచందన పరిశీలన
తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ఎడమకాల్వకు నీటిని విడుదల చేయగా వేములపల్లి ఎడమ కాల్వ వద్ద నల్లగొండ జిల్లా కలెక్టర్ హరిచందన బుధవారం నీటి సరఫరాను పరిశీలించారు. ఈ సందర్భంగా నాగార్జుసాగర్ ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజినీర్ నాగేశ్వర్రావును వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ పూర్ణచందర్, ఇరిగేషన్, ట్రాన్స్‌కో అధికారులు, మండల అధికారులు ఉన్నారు.