పాలకవీడు, ఏప్రిల్ 26 : రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన నూతన భూ భారతి చట్టం ద్వారా సాదాబైనామా దరఖాస్తుదారుల సమస్యలు పరిష్కారం అవుతాయని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. శనివారం పాలకవీడు మండలంలోని గుడుగుంట్లపాలెం గ్రామంలో రైతు వేదికలో భూ భారతి చట్టంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ. భూ భారతి చట్టం ద్వారా అధికారులకు మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుందని తెలిపారు. 2014 ముందున్నటువంటి సాదాబైనామాల లబ్ధిదారుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు. భూ భారతి చట్టం ద్వారా ప్రతి రైతుకు భూధార్ కార్డు అందజేయడం జరుగుతుందని చెప్పారు.
గ్రామాల్లో భూ సమస్యలు లేకుండా చూసే విధంగా ఏర్పాటు చేసిన చట్టమే భూ భారతి చట్టం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, ఎంపీడీఓ లక్ష్మి, తాసీల్దార్ కమలాకర్, మండల ప్రత్యేక అధికారి శంకర్, వ్యవసాయ అధికారి కళ్యాణ చక్రవర్తి, నేరేడుచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ విజయలక్ష్మి, నాయకులు గోపాల్, మోతిలాల్, సుబ్బారావు, నరసింహారావు పాల్గొన్నారు.