సూర్యాపేట, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ) : సమైక్య పాలనలో ఆగమైన రైతులకు బీఆర్ఎస్ సర్కారు అండగా నిలుస్తున్నది. స్వరాష్ట్రంలో అన్ని విధాలుగా ఆదుకుంటూ దన్నుగా నిలుస్తున్నది. రైతు సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు అమలు చేస్తున్నది. ఇప్పటికే విజయవంతంగా అమలవుతున్న రైతుబంధు సాయాన్ని మరింత పెంచనున్నది. ఇప్పటివరకు ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు ఇస్తుండగా దానిని రూ.16 వేలకు చేయనుంది. ఈ మేరకు బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పొందుపరిచింది. అధికారంలోకి రాగానే విడుతల వారీగా అమలు చేస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో 9.82 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనున్నది. ప్రభుత్వంపై ఏటా రూ.690 కోట్లకు పైగా అదనంగా భారం పడనున్నది. రైతుబంధు సాయం పెంపుపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైతాంగాన్ని ఆదుకునేందుకు, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా ప్రతి సీజన్లో ఎకరానికి రూ.5వేల చొప్పున ఏడాదికి రూ.10వేల పెట్టుబడి సాయం ఇస్తున్నారు. దాన్ని రూ.16వేలకు పెంచుతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఏడాదికి ఎకరానికి రూ.12వేల నుంచి ఏటేటా పెంచుతూ ఐదేండ్లలో రూ.16వేలు చేస్తామని బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించారు. రైతుబంధు పెంపుపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ స్కీమ్ ద్వారా ఇప్పటికే వానకాలం, యాసంగి సీజన్లకు కలిపి నల్లగొండ జిల్లాలో 4.82 లక్షల మంది రైతులు, సూర్యాపేట జిల్లాలో 2.67లక్షలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2.33 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. పెంచబోయే పెట్టుబడి సాయం ద్వారా ప్రభుత్వంపై ప్రతి సీజన్‌కు ఉమ్మడి జిల్లాలోని సుమారు 11లక్షల ఎకరాలకు రూ.690 కోట్ల అదనపు భారం పడనుంది.
సమైక్య రాష్ట్రంలో రైతాంగం పడిన పాట్లు అన్నీఇన్నీ కావు. నీళ్లు లేక, విద్యుత్ రాక అవస్థలు పడేది. ఉన్న భూమిలో కొద్దోగొప్పో సాగు చేద్దామనుకుంటే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. నాడు వర్షాలు వస్తున్నాయంటే రైతులు నాగళ్ల వైపు కాకుండా అప్పుల కోసం తిరిగేది. ఇంట్లో ఉన్న కొద్దిపాటి నగలను తాకట్టు పెట్టడం.. భూమి తనఖా పెట్టడం.. వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తేవడం వంటివి చేసేది. ఇంత చేసి నానా కష్టాలు పడి సాగుచేస్తే పండిన పంట అప్పులకు కూడా సరిపోకపోయేది. దాంతో అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇప్పుడా పరిస్థితి లేదు. పుష్కలంగా నీళ్లు.. నిరంతర ఉచిత విద్యుత్, సీజన్ ప్రారంభానికి ముందే పెట్టుబడి సాయం అందుతుండడంతో వ్యవసాయం పండుగలా మారింది. రైతులకు పంట పెట్టుబడి సాయం ఇవ్వాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్ 2018లో రైతుబంధు పథకాన్ని ప్రారంభించి వానకాలం సీజన్ నుంచి ఎకరాకు రూ.4వేల చొప్పున అందించారు. యాసంగి నుంచి రూ.5వేలు అందిస్తున్నారు. మూడోసారి విజయం సాధిస్తే రెండు సీజన్లు కలిపి ఎకరానికి రూ.16వేల వరకు ఇస్తామని బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 9.82 లక్షల మంది రైతులకు లబ్ధి
రైతుబంధు పథకం ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 9.82 లక్షల మంది రైతులు పెట్టుబడి సాయం పొందుతున్నారు. నల్లగొండ జిల్లాలో 4.82లక్షలు, సూర్యాపేటలో 2.67 లక్షలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2.33 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అవుతున్నాయి. ప్రస్తుతం సీజన్‌కు ఎకరానికి రూ.5వేల చొప్పున ఏడాదికి రూ.10వేలు అందుతుండగా.. మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదికి రూ.16వేల చొప్పున అందనున్నాయి. ఇప్పటి వరకు రూ.10వేల చొప్పున ఇస్తుండగా.. ఉమ్మడి జిల్లాలోని 9.82 లక్షల మంది రైతులకు ఒక్కో సీజన్‌కు దాదాపు రూ.1,205 కోట్ల చొప్పున ఏడాదికి 2,410 కోట్ల రూపాయలు అందుతున్నాయి. పెరుగబోయే పెట్టుబడి సాయం ప్రకారం ఏటా ఎకరానికి రూ.16వేల చొప్పున ఉమ్మడి జిల్లాలోని సుమారు 11 లక్షల ఎకరాలకు రూ.690 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడనుంది.
మోటర్లకు మీటర్లు వద్దు.. కేసీఆర్ దిక్కే ఉంటాం
నాకు ఎకరం పొలం ఉంది. సీఎం కేసీఆర్ సీజన్‌కు రూ.5వేల రైతు బంధు డబ్బులు ఇస్తుండు. సంవత్సరానికి రూ.10 వేలు అందుతున్నాయి. ఆ పైసలను ఎరువులు, విత్తనాలు కొనడానికి వాడుతాను. 24 గంటల కరెంటు వల్ల మోటర్లు పుష్కలంగా పోస్తున్నాయి. పంట దిగుబడి మంచిగా వస్తున్నది. మళ్ల ఎన్నికలల్ల గెలిస్తే ఎకరానికి రూ.8వేలు ఇస్తడంట. బీఆర్ఎస్ ఎన్నికల హామీలు చూసి కాంగ్రెసోళ్లు కంగుతింటున్నరు. మా రైతులకు 3 గంటల కరెంటు ఇస్తే సాలని రేవంత్‌రెడ్డి పిచ్చికూతలు కూస్తుండు. మోటర్లకు మీటర్లు మాకొద్దు.. సీఎం కేసీఆర్ దిక్కే రైతులమంతా ఉండి మళ్లా గెలిపించుకుంటం. రైతుబంధు డబల్ చేయించుకుంటం.
– బాదిని అంతమ్మ, నోముల, నకిరేకల్ మండలం
రైతుబంధు పెంపుతో మరింత భరోసా
రైతుల కష్టాన్ని అర్థం చేసుకున్నది సీఎం కేసీఆర్ ఒక్కరే. రైతులు పెట్టుబడులకు ఇబ్బంది పడుతున్నరని రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చారు. పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.5వేల చొప్పున ఏడాదిలో రెండు పంటలకు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. నాకు కొండమల్లేపల్లి పరిధిలోని కోల్‌ముంతల్‌పహాడ్ గ్రామ పరిధిలో ఐదెకాల భూమి ఉంది అందులో ఎకరం వరి, నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నా. ఏటా రైతుబంధు డబ్బు రూ.50 వేలు నా ఖాతాలో పడుతున్నయి. రైతుల కష్ట్టనష్టాలు ఎరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టుబడి సాయాన్ని దశల వారీగా రూ.16వేలకు పెంచుతామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించడం ఆనందంగా ఉన్నది. మా లాంటి రైతులకు ఇంతకంటే ఏం కావాలి. గత ప్రభుత్వాల హయాంలో పంట తడుపుకోవడానికి నానా అవస్థలు పడేటోళ్లం. ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని కరెంటుతో ఇబ్బందులుండేవి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 24 గంటల కరెంటు ఇస్తుండడంతో అవసరమైనప్పుడు పంటకు నీళ్లు పెట్టుకుంటున్నం. అన్నదాతకు మేలు చేసే ఇలాంటి ప్రభుత్వం ఉండడం మా అదృష్టం. రైతుల మేలు కోరే ముఖ్యమంత్రిని మళ్లీ గెలిపించుకుంటం.
– బూడిద రమేశ్, రైతు, కొండమల్లేపల్లి
రైతులను ఆదుకుంటున్న కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం
నేను పదేండ్లుగా వ్యవసాయం చేస్తున్నా. రైతులకు ఇంత మంచిగా సాయం చేసిన పార్టీలు గతంలో ఎప్పుడూ చూడలేదు. అప్పట్లో సరిగ్గా కరెంటు ఉండకపోయేది. పంట పెట్టుబడి కోసం త్రీవ ఇబ్బందులు పడేవాళ్లం. 3 రూపాయల మిత్తికి అప్పు తెచ్చి పంటలు సాగు చేసేది. ధాన్యాన్ని తక్కువ ధరకే అమ్ముకునేవాళ్లం. పండించిన పంటంతా అప్పులకే సరిపోయేది. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల గోసను తీర్చేందుకు రైతుబంధు ద్వారా ఎకరానికి ఏటా రూ.8వేలు ఇచ్చిండు. దానిని రూ.10వేలకు పెంచిండు. మళ్లీ ఇప్పుడు రూ.12వేలు ఇవ్వడంతోపాటు ఐదేండ్ల వరకు రూ.16వేలు ఇస్తామంటున్నడు. అదునుకు డబ్బులు ఇవ్వడంతో పెట్టుబడి భారం తగ్గింది. మరణించిన రైతు కుటుంబానికి ప్రమాద బీమా కింద రూ.5లక్షలు, వ్యవసాయానికి 24గంటల కరెంటు ఇస్తూ ప్రభుత్వమే వడ్లు కొనడంతో మాకు ఎంతో మేలు జరుగుతున్నది. రైతును ఇంత మంచిగా ఆదుకున్న సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం. రైతుల కోసం నిత్యం ఆలోచిస్తున్న కేసీఆర్ సారును మళ్లీ గెలిపించుకుంటాం.
– బీసం మల్లేశం, రైతు, లక్ష్మీదేవిగూడెం, మునుగోడు మండలం
రైతుల జీవితాలు మార్చడానికే రైతుబంధు
రైతుల జీవితాలను మార్చడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకం పెట్టిండ్రు. ఈ పథకం లేనప్పుడు అప్పులు తెచ్చి వడ్డీలు కట్టలేక పొలాలు అమ్మిన రైతులు, సరైన పంటలు పండక నాగులకు తెచ్చి నాగు కిందనే పొలాలు కట్టినవారు చాలా మంది రైతులు ఉన్నారు. రైతుబంధు పథకం ద్వారా అప్పులు తెచ్చే ఇబ్బందులు తప్పినయి. రైతుబంధు పథకం పైసలను పెంచి ఇస్తామన్న కేసీఆర్ వెంటే రైతులంతా ఉంటారు. రైతు కష్టం తెలిసిన నాయకుడు కాబట్టే రైతుకు ఇబ్బంది కలుగకుండా చూస్తుండు. ఎవరెన్ని మాటలు చెప్పినా రైతుల నాయకుడు సీఎం కేసీఆరే.
– బొడ్డు సాయిలు, రైతు, బాబుసాయిపేట, త్రిపురారం మండలం
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్
రైతులను రాజును చేసేందుకు కృషి చేస్తున్న రైతు బాంధవుడు సీఎం కేసీఆర్. నాకు తోపుచర్లలో నాలుగు ఎకరాల పొలం ఉన్నది. రైతుబంధు పథకంతో నాకు ఏడాదికి రూ.40వేలు వస్తున్నాయి. ఆ డబ్బుతో సాగుకు అవసరమయ్యే ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు కొనుగోలు చేస్తున్నా. సంవత్సరంలో రెండు కార్లకు ఇచ్చే రూ.10వేల సాయాన్ని బీఆర్ఎస్ తిరిగి అధికారం చేపట్టాక రూ.16వేలకు పెంచుతామని హామీ ఇవ్వడం గొప్ప విషయం. సకాలంలో రైతుబంధు డబ్బులు పంపుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతుల అభివృద్ధి కోసం ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రిని నేనెప్పుడూ చూడలేదు. మేమంతా బీఆర్ఎస్ వెంటే ఉండి మళ్లీ గెలిపించుకుంటాం.
– కాటసాని హనుమారెడ్డి, రైతు, తోపుచర్ల, మాడ్గులపల్లి మండలం
రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే పంట పెట్టుబడి సాయం రూ.16వేలకు పెంచుతామని చెప్పడంతో చాలా సంతోషించాం. సీఎం కేసీఆర్ స్వయంగా రైతుబిడ్డ కాబట్టి రైతుబంధును మరోసారి పెంచుతామంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులు పంట పెట్టుబడి కోసం అప్పులు చేసి సరైన పంటలు పండక ఆత్మహత్యలు చేసుకున్న రోజులు గుర్తుకొస్తేనే భయమేస్తుంది. రైతును రాజును చేస్తామని చెప్పిన నాయకులను చాలా మందిని చూశాం. మా ఓట్లను దండుకొని అధికారంలొకి వచ్చి మమ్మల్ని గాలికొదిలేసిన ప్రభుత్వాలను చూశాం. కానీ.. కేసీఆర్ సారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటుండు. రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తూ, పంటలను మద్దతు ధరకు కొంటున్నారు. రైతు బీమా ఇచ్చి మా కుటుంబాలను ఆదుకుంటున్నారు. దాంతో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగిపోయాయి. రైతులు సంతోషంగా ఉంటున్నారంటే అది కేసీఆర్ పుణ్యమే. మళ్లీ ఆయనే సీఎం కావాలని కోరుకుంటున్నా.
– షేక్ ఇమామ్, రాంనగర్, మిర్యాలగూడ పట్టణం
రైతుబంధు లేకుంటే మా పరిస్థితి అధోగతే..
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పెట్టకుంటే మా పరిస్థితి మరోలా ఉండేది. మా తండాలో పంటలన్నీ బోర్లపైనే ఆధారపడి ఉన్నాయి. గతంలో పంటలు సాగు చేయాలంటే అప్పుజేసేటోళ్లం. అప్పు తెచ్చి పంట వేసినా కరెంటు లేక ఎండిపోయి శానా సార్లు నష్టపోయాం. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ ఒక పక్క కరెంటు ఇచ్చుకుంటూ.. మరో పక్క రైతుబంధు కింద డబ్బులు ఇస్తున్నారు. ఎకరానికి ఇప్పుడు పది వేలు ఇస్తుండగా.. మళ్లీ గెలిస్తే రూ.16 వేలు ఇస్తామని చెప్పడంతో ఎంతో సంతోషంగా ఉన్నది. కేసీఆర్ సారు మాట ఇచ్చిండంటే తప్పడు. రైతుబంధు డబ్బులు కష్టకాలంలో ఆదుకుంటున్నాయి. పంట వేసే ముందే డబ్బులు బ్యాంకులో పడుతుండడంతో విత్తనాలు, ఎరువులు కొంటున్న. రూ.16వేలు చేస్తే ఎరువులు, విత్తనాలు, పంట ఖర్చులకు సరిపోతాయి. పంట సాగుకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
– ధనావత్ కోకానాయక్, తిమ్మాపురం, దామరచర్ల మండలం
ముఖ్యమంత్రి కేసీఆర్ సాయం మరువలేనిది
ముఖ్యమంత్రి కేసీఆర్ సారు అందించే సాయం మరువలేనిది. రైతులను అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుంటున్నారు. అడగకముందే రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చి ఎకరానికి రూ.5వేల చొప్పున సంవత్సరానికి రెండు కార్లకు రూ.10వేలు ఇస్తున్నారు. కాలం మొదలు కాకముందే రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నారు. మళ్లీ గెలిస్తే రూ.10వేల సాయాన్ని రూ.16వేలకు పెంచుతామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టడం సంతోషంగా ఉన్నది. రైతు బాంధవుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు వెంటే రైతులందరూ ఉండి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాం.
– కుర్ర శాంక్రియా, రైతు, జిలకురకుంటతండా, అడవిదేవులపల్లి మండలం