నల్లగొండ : తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకునేందుకు ఆర్టీసీ కార్మికులు సమాయత్తమవుతున్నారు. ఆర్టీసీ సమ్మె సన్నహకాల్లో భాగంగా బుధవారం నల్లగొండ డిపో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ ఏర్పాటుచేసి సమ్మె కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రభుత్వం తమ సమస్యలపై తక్షణ స్పందన ఇవ్వకపోతే సమ్మె తప్పదని జేఏసీ స్పష్టం చేసింది. ఇప్పటికే మార్చి 13వ తేదీన యాజమాన్యానికి సమ్మె నోటీసు అందజేసినట్లు వెల్లడించింది.
కాగా, ఈ నెల 22 నుంచి సమ్మెకు దిగనున్నట్టు ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలు ప్రకటించారు. సోమవారం లేబర్ కమిషన్ జాయింట్ లేబర్ కమిషనర్ సునీతా గోపాల్‌దాస్ నేతృత్వంలో చర్చలకు సమావేశం నిర్వహించారు. ఈ చర్చలకు ఆర్టీసీ యాజమాన్య సంస్థ నుంచి అధికారులెవరూ రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మిక జేఏసీ సమ్మె తేదీని ప్రకటించింది. కార్మికులు, ఇతర కార్మిక సంఘాలు ఐక్యంగా సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, యాజమాన్యం వైఫల్యంతో దిక్కుతోచని స్థితిలోనే సమ్మెకు వెళ్తున్నామని వెల్లడించింది.
ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, థామస్ రెడ్డి జేఏసీ రాష్ట్ర నాయకులు బోయపల్లి యాదయ్య, నరేందర్, బాసాని వెంకటయ్య. జిల్లా నాయకులు ఎన్ఆర్సీ రాజు, టీజే రావు, వై చంద్రయ్య, ఎస్సీ,ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొర్ర లింగా నాయక్ డిపో జేఏసీ నాయకులు ఈఎస్ రెడ్డి, ఏల్ స్వామి, వీఎస్ రెడ్డి పాల్గొన్నారు.