దేవరకొండ రూరల్, మే 31 : ఆర్టీసీలో ఉద్యోగం చాలా శ్రమతో కూడుకున్నదని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. దేవరకొండ ఆర్టీసీ ఉద్యోగి ఆర్.ఎస్ రావు నిర్మల ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఉద్యోగి సంస్థ అభివృద్ధి కోసం విధుల్లో చేరిన నాటి నుండి అహర్నిశలు కృషి చేస్తారని తెలిపారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. టీజీఎస్ఆర్టీసీలో ఎంతో పని ఒత్తిడి ఉన్నా గత 35 ఏళ్లుగా ఎలాంటి మచ్చ లేకుండా పదవీ విరమణ చేయడం గొప్ప విషయమని కొనియాడారు.
ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయక పనిచేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంట్ కో ఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, పీఏసీఎస్ చైర్మన్ కొండ్ర శ్రీశైలం యాదవ్, పట్టణ మాజీ సర్పంచ్ పున్న వెంకటేశ్వర్లు, ఆర్టీసీ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యూఐ నాయకులు పాల్గొన్నారు.