తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ)ను ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఏడు డిపోలతోపాటు పలు ప్రాంతాల్లో మంగళవారం సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేసి జై కేసీఆర్, జై టీఎస్ ఆర్టీసీ అంటూ నినాదాలు చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సంతోష వేడుకల్లో పలుచోట్ల ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు భాగస్వాములయ్యారు. వారం రోజుల పాటు సంబురాలకు సిద్ధమైనట్లు ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి.
నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సోమవారం జరిగిన రాష్ట్ర క్యాబినేట్ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న నిర్ణయంతో సంస్థ కార్మికుల్లో ఎక్కడా లేని సంతోషం వ్యక్తమవుతున్నది. ఊహించని ఈ నిర్ణయంపై ఆర్టీసీ సిబ్బందితోపాటు వారి కుటుంబాల్లోనూ ఆనందోత్సాహాలు వెల్లడవుతున్నాయి. సర్కారు నిర్ణయంపై టీఎస్ ఆర్టీసీ నల్లగొండ రీజియన్ పరిధిలోని ఏడు డిపోల్లో వివిధ విభాగాలకు చెందిన 2,479 మంది ఉద్యోగులు, కార్మికులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. విలీనంపై రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన అధికారులతో కూడిన సబ్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా విధివిధానాలు ఖరారు కానున్నాయి.
ఈ నెల 3నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును పెట్టి ఆమోదించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దీంతో త్వరలోనే తామంతా మిగతా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే మంచి వేతనాలతోపాటు అన్ని రకాల సౌకర్యాలకు అర్హులం కానున్నామన్న సంతోషంతో సంబురాల్లో మునిగి తేలుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల మంగళవారం ఉమ్మడి జిల్లా అంతటా ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది వివిధ రూపాల్లో తమ అభిమానాన్ని ప్రదర్శించారు. అన్ని డిపోల పరిధిలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు చేశారు. వీటిల్లో డిపో మేనేజర్లతోపాటు అన్ని విభాగాల ఉద్యోగులు, కార్మికులు, సిబ్బంది భాగస్వాములయ్యారు. నల్లగొండ డిపోలో ఉదయాన్నే సంబురాలు నిర్వహించారు.
డిపో మేనేజర్ రామ్మోహన్‌రెడ్డి, కార్మిక సంఘాల నేతలు, ఉద్యోగులు, సిబ్బంది అంతా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ జిందాబాద్.. కేసీఆర్ లాంగ్‌లివ్.. ఆర్టీసీ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ క్షీరాభిషేకం నిర్వహించారు. మిర్యాలగూడ డిపోలో పెద్ద ఎత్తున సంబురాలు జరిపారు. సూర్యాపేటలో సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రి జగదీశ్‌రెడ్డి ఫ్లెక్సీకి కార్మిక సంఘాల నేతలు, కార్మికులు, ఉద్యోగులంతా కలిసి క్షీరాభిషేకం జరిపారు. ఉద్యోగ, కార్మిక పక్షపాతి కేసీఆర్ వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ స్వీట్లు పంచిపెట్టారు. కోదాడలో డిపోకు చెందిన వారంతా పాల్గొని ముఖ్యమంత్రి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు. యాదగిరిగుట్ట డిపోలో నిర్వహించిన కార్యక్రమంలో ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సంబురాల్లో జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు..
నార్కట్‌పల్లి డిపో పరిధిలో జరిగిన సంబురాల్లో సంస్థ ఉద్యోగులు, కార్మికులతో పాటు జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, హాలియాలో ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సు ముందు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకాలు నిర్వహించారు. తెలంగాణ వచ్చాకే ఆర్టీసీకి భరోసా లభించిందని, 44శాతం పీఆర్సీ ఇచ్చిన ఘనత కూడా సీఎం కేసీఆర్‌దేనని కార్మిక సంఘాల నేతలు కొనియాడారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ స్వరాష్ట్రంలో ఉద్యోగుల ఫ్రెండ్లీ సర్కార్ కొనసాగుతున్నదని, సీఎం కేసీఆర్ ఉద్యోగ పక్షపాతి అని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న నిర్ణయం చారిత్రాత్మకమని.. సంస్థ ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబాలు సీఎం కేసీఆర్ వెన్నంటి నిలువాలని కోరారు.
మిర్యాలగూడ డిపోలో..
మిర్యాలగూడ టౌన్, ఆగస్టు 1 : మిర్యాలగూడ డిపోలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ బొల్లెద్దు పాల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైందన్నా రు. సంస్థను అభివృద్ధిపథంలో నిలుపడానికి రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్టీసీ సీఐ సంధ్యారాణి, సిబ్బంది పాల్గొన్నారు.
దేవరకొండలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
దేవరకొండ, ఆగస్టు 1 : ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడంతో సంస్థ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మంగళవారం దేవరకొండ డిపోలో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. తమ కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జీవితంలో మర్చిపోలేమని పలువురు పేర్కొన్నారు. ఉద్యమంలో కేసీఆర్‌కు అండగా ఉండి తెలంగాణ రాష్ట్రం సాధించామని తెలిపారు. ఇక మీదట ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని, దేవరకొండ డిపోను లాభాల బాటలో నడిచేలా కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ రాజీవ్ ప్రేమ్‌కుమార్, అసిస్టెంట్ మేనేజర్ భారతీబాయి, సంస్థ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.
ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్
సూర్యాపేట అర్బన్, ఆగస్టు 1 : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్త్తూ సంస్థ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని టీఎంయూ జిల్లా అధ్యక్షుడు సుంకరి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం సూర్యాపేట డిపో వద్ద సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ సందర్భంగా త్వరలో శుభవార్త వింటారని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారని, కానీ.. ఇంత పెద్ద శుభవార్త వింటామని అనుకోలేదని చెప్పారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ సురేందర్, ఉద్యోగులు బెల్లి నర్సయ్య, శ్రీనివాస్‌గౌడ్, చెరుకు వెంకటయ్య, సైదులు, భాస్కర్, ఏకాంబరం, మధుసూదన్‌రావు, కుమార్, బీఎస్ రావు పాల్గొన్నారు.
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఆనందకరం
జడ్పీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి
నార్కట్‌పల్లి, ఆగస్టు 1 : టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఆనందకరమని జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నార్కట్‌పల్లి బస్‌స్టేషన్ ఆవరణలో మంగళవారం ఆర్టీసీ కార్మికులతో కలిసి సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పోరాడిన ఆర్టీసీ కార్మికులను ముఖ్యమంత్రి కేసీఆర్ మరిచిపోకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం సంతోషకరమన్నారు. సంస్థ సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను మరువవద్దని, కార్మికులంతా మంచిగా పని చేసి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, డిపో కార్మికులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి
ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్
హాలియా, ఆగస్టు 1 : 43వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక పక్షపాతి అని ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. మంగళవారం హాలియా బస్టాండ్‌లో ఆర్టీసీ సిబ్బందితో కలిసి సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో ఆర్టీసీ అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వపరం చేస్తూ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు జవ్వాజి వెంకటేశ్వర్లు, మర్ల చంద్రారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్టీసీ ఉద్యోగుల హర్షం
నల్లగొండ సిటీ, ఆగస్టు 1 : ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వం నిర్ణయించడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులంతా ఆనందంలో మునిగి తేలుతున్నారు. సీఎం కేసీఆర్ నిర్జయాలను స్వాగతిస్తూ మంగళవారం నల్లగొండ బస్టాండ్ ఆవరణలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ రామ్మెహన్‌రెడ్డి మాట్లాడుతూ మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన సీఎం కేసీఆర్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. దశాబ్దాల తరబడి ఎదురు చూస్తున్న కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తమతో వెట్టి చాకిరీ చేయించుకున్నారని, తమ ఆత్మగౌరవం దెబ్బతినేలా అప్పటి ప్రభుత్వాలు వ్యవహరించాయని విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ తమకు న్యాయం చేశారని చెప్పారు. గతంలో పీఆర్సీ ఇచ్చి తమ కష్టానికి ప్రతిఫలం అందించారని కొనియాడారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తమను తలెత్తుకుని తిరిగేలా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికీ తమకు దేవుడని అన్నారు. కార్యక్రమంలో డీవీఎం శివకుమార్, ఆర్టీసీ సిబ్బంది లావణ్య, మహేశ్వరి, దయాకర్, శారద, తయాబ్, వెంకటేశ్వర్లు, టీజేరావు, అన్వర్‌అలీ, జానీపాషా, రవి తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ ఉద్యోగులకు బీఆర్ఎస్ సర్కారులోనే గుర్తింపు
కోదాడ టౌన్, ఆగస్టు 1 : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో కోదాడ డిపో ఎదుట సంస్థ కార్మికులు పటాకులు కాల్చి, మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ 43వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటామన్నారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా ఆర్టీసీ ఉద్యోగులను పట్టించుకోలేదని విమర్శించారు. ఉద్యోగులకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో శ్రమకు తగిన గౌరవం దక్కిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు చందు నాగేశ్వర్రావు, సంఘం నాయకులు షేక్ నయీమ్, మాజీ సర్పంచ్ పైడిమర్రి సత్తిబాబు, గ్రంథాలయ చైర్మన్ రహీం, కోట మధు, ఖాదర్ పాషా, వంటిపులి శ్రీను, కందుల చంద్రశేఖర్, మదార్, దేవమణి, ఉపేందర్, పాండు, రంగారావు, ముస్తఫా, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.
భరోసా గోరికింది
సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను గుర్తించి ప్రభుత్వంలో విలీనం చేయాలని తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయం. ఎన్నో ఏండ్లుగా చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడ్డ మమ్మల్ని గుర్తించడంతో మా బతుకులకు భరోసా కలిగింది. ఇన్నాళ్లు కార్పొరేషన్లో కార్మికులుగా పనిచేసిన మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– అరుణ, కండక్టర్, నల్లగొండ డిపో
ఆర్టీసీ ఉద్యోగుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగుల పాలిట దేవుడు. సంస్థ నష్టాల్లో ఉన్న సమయంలో బడ్జెట్లో నిధులు కేటాయించి కాపాడిండు. పలు రాష్ర్టాల్లో ఆర్టీసీకి అక్కడి ప్రభుత్వాలు ఎలా నిధులు సమకూర్చాయో తెలుసుకుని తెలంగాణలోనూ నిధులు అందిస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సంతోషకరం. రాష్ట్రం కోసం ఉద్యమంలో పాల్గొన్న ఆర్టీసీ ఉద్యోగులను కన్న బిడ్డలా కాపాడుకున్నరు.
– కేవీ రెడ్డి, ఆర్టీసీ డ్రైవర్, నల్లగొండ డిపో
మా జీవితాలకు భద్రత కల్పించిన సీఎం కేసీఆర్
ఇన్నాళ్లకు మా కష్టాలు ఫలించాయి. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల మా జీవితాలకు, ఉద్యోగాలకు భద్రత కలిగింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల మాలో ఆత్మ ైస్థెర్యం కలిగింది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. నిత్యం ప్రజలకు ఎంతో సేవచేసే మా లాంటి చిన్నపాటి ఉద్యోగులకు గత పాలకులు ఎన్నడూ గుర్తించలేదు. ఇప్పుడు సీఎం కేసీఆర్ మమ్ములను గుర్తించి సంస్థను ప్రభుత్వ పరం చేయడంతో ఆర్టీసీ సేవలు కూడా మెరుగయ్యే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్‌కు ఆర్టీసీ కార్మికులంతా రుణపడి ఉంటాం.
-బొల్లేపల్లి పాపరాజు, కండక్టర్, మిర్యాలగూడ డిపో
సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం సంతోషకరం. సంస్థలో మా కృషిని గుర్తించి ప్రభుత్వంలో విలీనం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కార్మికులమంతా రుణపడి ఉంటాం. కార్పొరేషన్‌గా ఉన్నప్పుడు ఎన్ని ఉద్యమాలు చేసినా మమ్మల్ని పట్టించుకున్న నాయకుడే లేడు. ఇలాంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడం సీఎం కేసీఆర్‌కే సాధ్యం. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న మా కల నెరవేరింది. ఉద్యోగ భద్రతతో మా కుటుంబాల్లో వెలుగులు నింపారు.
– పి.సైదులు, ఆర్టీసీ కండక్టర్, మిర్యాలగూడ డిపో
సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం
ఆర్టీసీని ప్రభుత్వపరం చేస్తున్నట్లు కేబినెట్లో తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనది. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న ఆర్టీసీ కార్మికుల కల నెరవేర్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. నష్టాల్లో ఉన్న కార్పొరేషన్‌ను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి లాభాల బాటలో నడిపించారు. ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం చేస్తూ మా బతుకుల్లో వెలుగులు నింపుతున్నారు. ఉద్యోగ భద్రత లభించినందుకు చాలా సంతోషంగా ఉన్నది. విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో కళ్లారా చూస్తున్నాం. ఇలాంటి నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– ఎస్కే ఇక్బాల్, ఆర్టీసీ ఉద్యోగుల సంఘం మిర్యాలగూడ డిపో అధ్యక్షుడు
ఉద్యోగ భరోసా కల్పించిన మహనీయుడు సీఎం కేసీఆర్
పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆర్టీసీని రక్షించి కార్మికులందరికీ ఉద్యోగ భరోసా కల్పించారు. సంస్థను ప్రైవేటుపరం చేస్తే మా భవిష్యత్తు ఏంటని చాలా కాలంగా ఆందోళన చెందుతున్నాం. ఈ పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ ఆపబ్బాంధవుడిగా ఆర్టీసీని ప్రభుత్వపరం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సర్కారు నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 43వేల మందికి పైగా లబ్ధి చేకూరుతుంది. ప్రైవేట్‌పరం చేస్తే వేలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉండేది. సీఎం కేసీఆర్ కార్మికులపైన ప్రేమతో ఆర్టీసీని ప్రభుత్వపరం చేసి భరోసా కల్పించిన మహనీయుడు సీఎం కేసీఆర్.
– పాలకూర గోపయ్య, నల్లగొండ రీజియన్ ఉద్యోగుల సంఘం నాయకుడు (మిర్యాలగూడ)