సూర్యాపేట అర్బన్, ఏప్రిల్ 8 : ఆర్టీసీలో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ మే 7 నుంచి చేపట్టనున్న సమ్మెకు సిద్ధం కావాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శులు పుడిగ పుల్లయ్య, సుంకరి శ్రీనివాస్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంగళవారం వారు ఆర్టీసీ ఉద్యోగులు, జేఏసీ నాయకులను కలిసి మాట్లాడారు.
ఉద్యోగులకు గతంలో రోజుకు 500 కిలోమీటర్లు ఉన్న పని భారాన్ని 600 పెంచారని అన్నారు. నేటికీ 2017 అలవెన్స్లు అమలు చేయడం లేదని తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో సంస్థ ఉనికి ప్రమాదంలో పడుతుందని చెప్పారు.
చలో లేబర్ కమిషనర్ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందని, ఇలాగే ఐక్యంగా ఉండి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. సమావేశంలో ఎస్ఎస్ గౌడ్, ఆర్.సైదులు, జి.వెంకన్న, మధు, వి.సేవ్యా, భాను, అబ్దుల్ ఘని, లచ్చయ్య, ఏకాంబరం, నేతి సావిత్రి, సైదమ్మ, సాగర్, వెంకన్న పాల్గొన్నారు.