సూర్యాపేట అర్బన్, మార్చి 23 : ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ప్రస్తుత అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. సూర్యాపేటలో ఆదివారం వారు జగదీశ్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా ఒత్తిడి తీసుకురావాలని, మహాలక్ష్మి పథకంతో ఉద్యోగులపై పెరిగిన పని ఒత్తిడిని తగ్గించాలని తెలిపారు. ఉద్యోగుల జీతాలు సవరించి పెంచే విధంగా చేయాలని, చిన్న చిన్న తప్పులకు ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగులకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి వారికి హామీ ఇచ్చారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సుంకరి శ్రీనివాస్, జి.ఏకాంబరం, బెల్లి నర్సయ్య, జక్కుల వెంకటేశ్వర్లు, జి.వెంకన్న, ఎ.శ్రీవర్ధన్రాజు ఉన్నారు.