నల్లగొండ ప్రతినిధి, జూన్30(నమస్తే తెలంగాణ) : రైతు బంధు డబ్బు వరుసగా జమ అవుతున్నది. శుక్రవారం నాలుగు ఎకరాల్లోపు రైతులందరికీ పంట పెట్టుబడి సాయం అందింది. ఈ నెల 26నుంచి ప్రభుత్వం రైతుబంధు సాయం అందిస్తున్నది. ఇప్పటి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 8.46లక్షల మంది రైతులకు సంబంధించిన 13.46లక్షల ఎకరాలకు రూ. 673.06 కోట్లు విడుదలయ్యాయి. వర్షాలతో సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న సమయంలో పెట్టుబడికి డబ్బులు అందడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలోనే అత్యధిక ప్రయోజనం పొందే రైతుబంధు డబ్బులు వరుసగా రైతులందరికీ అందుతున్నాయి. తొలిరోజు ఎకరం లోపు రైతులతో మొదలైన పెట్టుబడి సాయం శుక్రవారం నాటికి నాలుగెరాల లోపు రైతులందరికీ అందింది. ఈ సీజన్లో సుమారు రూ.1300కోట్లు పెట్టుబడి సాయంగా ఉమ్మడి జిల్లా రైతులకు చెందనున్నాయని అంచనా. శుక్రవారం మూడెకరాల పైబడి నాలుగెకరాల లోపు విస్తీర్ణానికి నల్లగొండ జిల్లాలో 53,476మంది రైతులకు రూ.91.71కోట్లు, సూర్యాపేట జిల్లాలో 27,880 మంది రైతులకు గానూ రూ.47.11కోట్లు, యాదాద్రిభువనగిరి జిల్లాలో 24,900మంది రైతులకు రూ.42.44కోట్ల రైతుబంధు డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమైనట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు నాలుగు రోజుల్లో కలిపి నల్లగొండ జిల్లాలో 4,13,780మంది రైతులకు గాను 6,73,003ఎకరాలకు సంబంధించి మొత్తం రూ.336.50 కోట్లు పెట్టుబడి సాయం అందాయి. సూర్యాపేట జిల్లాలో 2,33,469మంది రైతులకు గాను 3,67,094 ఎకరాలకు సంబంధించి రూ.183.54 కోట్లు రైతులకు చెందాయి. యాదాద్రిభువనగిరి జిల్లాలో 1,99,041మంది రైతులకు గాను 3,06,039ఎకరాలకు సంబంధించి రూ.153.01 కోట్లు రైతులకు పెట్టుబడి సాయంగా నగదు జమైంది. పట్టాదారు పాస్‌పుస్తకం ఉన్న ప్రతీ రైతుకు చివరి వరకు వానాకాలం సీజన్లో పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత సీజన్ కంటే అదనంగా ఈ సారి మరింత ఎక్కువ మందికి రైతుబంధు పథకం లబ్ధి చేకూరనుంది.