అధికారం కోసం ఏదేదో చెప్పేస్తాం..అంత మాత్రాన చెప్పినవన్నీ చేసేయ్యలా ఏంటీ.. అన్నట్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ధోరణి ఉంది. తాజాగా రైతు భరోసా పథకానికి టోకరా వేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో తాము గద్దెనెక్కితే ఎకరాకు ఏడాదికి రూ.15,000 పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పారు. అది కూడా గత యాసంగి నుంచే అని ఢంకా బజాయించి చెప్పారు. కానీ యాసంగిలో మాజీ సీఎం కేసీఆర్ సిద్ధం చేసిన డబ్బునే అదే రూ.5,000 చొప్పున ఇస్తూ మమ అనిపించారు. ఇక వానకాలం నుంచి ఇస్తామని చెప్పి అసలుకే ఎసరుపెట్టారు. దీంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో ప్రస్తుత యాసంగి నుంచి ఎకరాకు రూ.7,5000 ఇస్తామని చెప్తూ వచ్చారు. తీరా శనివారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రూ.6వేలు మాత్రమే ఇవ్వగలమంటూ మడమ తిప్పారు.
దీంతో ఒక్కసారిగా రైతాంగం హతాశులైన పరిస్థితి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు సుమారుగా రూ.550కోట్ల పెట్టుబడి సాయాన్ని కోల్పోనున్నారు. వాస్తవంగా ఎన్నికల హామీ ప్రకారం ఎకరాకు రూ.7,500 ఇస్తే ఉమ్మడి జిల్లా రైతులకు కనీసం రూ.1,950 కోట్లు దక్కాలి. కానీ ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం వల్ల రూ.1,400 కోట్లకు కూడా గ్యారెంటీ లేకుండా పోయింది. ఇంకా సాగు భూములా? కాదా? అంటూ తేల్చేందుకు సర్వే రూపంలో కత్తి వేలాడుతూనే ఉంది. దీని ద్వారాను లబ్ధిదారుల సంఖ్య మరింత తగ్గిపోనుంది. ఒడ్డు చేరాక బోడి మల్లయ్య అన్నట్లుగా ప్రభుత్వ వ్యవహరిస్తుండడంతో రైతులు తీవ్రంగామండిపడుతున్నారు.
రూ.11,700 కోట్లు ఇచ్చిన కేసీఆర్
ఎన్నికల్లో హామీ ఇవ్వకుండానే వ్యవసాయాన్ని పండుగలా మార్చాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకానికి రూపకల్పన చేశారు. 2018 వానకాలం సీజన్ నుంచి రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్… ఎప్పుడూ మాట తప్పకుండా వరుసగా మొత్తం 11 సీజన్లల్లో క్రమం తప్పకుండా రైతుబంధు ఇస్తూ వచ్చారు. 2018 వానకాలం సీజన్ నుంచి మొదలుపెట్టి తొలి సీజన్లో రూ.4 వేలు, తర్వాత సీజన్ నుంచి ఎకరానికి రూ.5వేల చొప్పున ఏడాదిలో రెండు సీజన్లకు కలిపి రూ.10వేల సాయాన్ని అందిస్తూ వచ్చారు. అప్పటి నుంచి 2023 వానకాలం సీజన్ వరకు ఎన్నడూ రైతుబంధు ఆగలేదు. మొత్తం వరుసగా 11 సార్లు రైతుబంధు ద్వారా ఉమ్మడి జిల్లా రైతులకు రూ.11,700 కోట్ల నగదును కేసీఆర్ సర్కార్ పంపిణీ చేయడం విశేషం. ఇన్ని కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి పక్కదారి పట్టకుండా ప్రతి పైసా నేరుగా రైతులకే చెందేలా అత్యంత పకడ్బందీగా పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసింది. ఒక్క రూపాయి కూడా ఎవరికీ లంచం ఇవ్వకుండా నేరుగా రైతులకే చెందాయంటే నాటి ప్రభుత్వ చిత్తశుద్ధి తెలుస్తుంది.
కోతల కాంగ్రెస్ సర్కార్
ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ ప్రతి పథకంలో కోతలకే ప్రాధాన్యతనిస్తుంది. కేసీఆర్ సర్కార్ అమలు చేసిన పథకాల కంటే అదనంగా ఇస్తామని చెప్పి ఇప్పుడు ఎలా కోతలు పెట్టాలన్న ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ఎన్నికల్లో రుణం తీసుకున్న ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ అని గొప్పగా చెప్పారు. తీరా అమల్లోకి వచ్చే సరికి కుటుంబంలో ఒక్కరికే.. అది కూడా రెండు లక్షల వరకే అని కోతలు పెట్టింది. దీంతో గత ఆరు నెలల నుంచి మాఫీ కోసం ఇంకా ఉమ్మడి జిల్లాలో రైతులు 40శాతం మంది ఎదురు చూస్తున్నారు. ఇంకా రెండున్నర లక్షల మందికి రుణమాఫీ కావాల్సి ఉన్నది. ఇక తాజాగా రైతు భరోసా కుదింపుతో రైతులను మరోసారి మోసం చేస్తున్నారు. అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి గద్దెనెక్కాక కోతలు పెడుతూ మోసం చేస్తున్నారంటూ రైతులు, రైతు సంఘాల నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.
రూ.550 కోట్లు కోత
తాము అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.7500 చొప్పున రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ విధంగా ఒక్కో సీజన్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులకు రూ.1950 కోట్ల వరకు పెట్టుబడి సాయంగా అందాల్సి ఉంది. గతంలో కేసీఆర్ సర్కార్ హయాంలో చివరి సారిగా 2023 వానకాలం సీజన్లో ఎకరాకు రూ.5వేల చొప్పున ఉమ్మడి జిల్లాలో 10.81 లక్షల మందికి రూ.1,250 కోట్లు అందజేశారు. అదే ఏడాది యాసంగి సీజన్ కోసం కూడా పెట్టుబడి సాయాన్ని సిద్ధం చేయగా అప్పుడు ఎన్నికల కోడ్‌లో కాంగ్రెస్ అడ్డుపడింది. ఆ సీజన్లో 11లక్షల మంది రైతులకు రూ.1,300కోట్లు సిద్ధం చేశారు. ఈ ప్రకారం చూస్తే కాంగ్రెస్ హామీ మేరకు ఎకరాకు రూ.7,500 ఇస్తే ప్రస్తుత సీజన్లో అదనంగా 50శాతం లబ్ధితో మొత్తం రూ.1950 కోట్లు అందాలి. కానీ దాన్ని రూ.6వేలకు కోత పెట్టడం వల్ల రూ.1,400 కోట్లు కూడా దాటే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఉమ్మడి జిల్లా రైతులు సుమారు రూ.550 కోట్లు నష్టపోనున్నారు. ఇక పోతే ఇప్పటికే వానకాలం సీజన్లో రైతులు రూ.1,950 కోట్ల పెట్టుబడి సాయాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా తగ్గింపు వల్ల సుమారు రూ.2,500 కోట్ల పెట్టుబడి సాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు టోకరా వేసినట్లేనని రైతు సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇంకా ఇది కాకుండా సాగు భూములా? కాదా? అని తేల్చేందుకు మరోవైపు సర్వే కూడా చేస్తున్నారు. దీని వల్ల రైతులకు చెందాల్సిన పెట్టుబడి సాయం మరింత తగ్గపోనుంది. ఇక కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పిన మాటను ప్రస్తుతం అటకెక్కించారు.
హామీలను తుంగలో తొక్కింది
ఎన్నికల మ్యానిఫోస్టోలో రైతు భరోసా 15వేల రూపాయలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కుదించి 12వేలు ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేయడం తీవ్ర అన్యాయం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఎలాంటి షరతులు లేకుండా రైతులకు సకాలంలో రైతుబంధు అందించి ఆదుకున్నడు. గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు సాయం సకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకున్నం. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కుతూ రైతు రుణమాఫీ, వానకాలం పంటలకు పెట్టుబడి సాయం ఇవ్వక మోసం చేసింది. ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా కింద 15వేలు ఇవ్వాలి, లేకుంటే రైతులు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడం ఖాయం.
-బెల్లి రవి, రైతు, అయిటిపాముల, కట్టంగూర్ మండలం
కాంగ్రెస్‌కు రైతుల ఉసురు తగులుద్ది
ఎన్నికల హామీలో రైతు భరోసా ఏడాదికి 15 వేల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పి ఏడాదిగా కాలం గడిపి మొత్తం రైతుల భరోసా ఎగ్గొట్టారు. ఇప్పుడు 12 వేల రూపాయలే ఇస్తామని మాట మార్చి రైతులను మోసం చేస్తున్నారు. రేవంత్‌కు రైతులు ఉసురు తగులుద్ది. ఆసలు రైతు భరోసా ఇస్తారన్న నమ్మకం పోయింది. రెండు కార్లకు పెట్టుబడి సాయం ఆందక అప్పులు తెచ్చుకొని సాగు చేసినం. కాంగ్రెస్ ప్రజా పాలన అని అంటూ అన్ని వర్గాల ప్రజలను నట్టేట ముంచుతున్నది. గత ప్రభుత్వంలో కేసీఆర్ సకాలంలో రైతుబందు ఇవ్వడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు సంతోషంగా ఉన్నారు.
– చిలుకల ఎల్లయ్య, రైతు, బుద్దారం, నల్లగొండ రూరల్
కొర్రీలతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమై కొర్రీలతో కాలయాపన చేస్తున్నది. షరతులతో కూడిన రైతు భరోసా ఇస్తామనడం రైతులను అవమానించడమే. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైంది. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పాలనపై నమ్మకం పోయింది. రాష్ట్రంలోని రైతు భరోసా కోసం 23వేల కోట్ల రూపాయలు కావాల్సి ఉండగా కేవలం 7వేల కోట్ల నిధులు ఇవ్వడం సరికాదు. రేవంత్ సర్కారుకు తగిన గుణపాఠం ప్రజలు చెప్పడానికి సిద్ధం ఉన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పాలనను అసహ్యించుకుంటున్నారు.
-సయ్యద్ అబ్దుల్ నబీ, రైతు, లింగగిరి, హుజూర్నగర్ మండలం
ఒక్క హామీ సక్రమంగా అమలు చేయలేదు
నేను కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిని. కానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏడాది పాలన చూసి బాధపడుతున్న. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొన్న ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ సక్రమంగా అమలు చేయకపాయే. నాతోపాటు చాలా మంది రైతులకు రెండు లక్షల రుణమాఫీ కాలేదు. 2 లక్షల రూపాయలకుపైన ఉన్న పైసలు కట్టేమంటే నెలరోజుల క్రితం లక్షా 30 వేల రూపాయలు బ్యాంకులో వడ్డీ కట్టిన. ఇప్పటికీ నాకు రుణమాఫీ కాలేదు. ఎన్నికల ముందు ఎకరానికి 15వేల రైతు భరోసా ఇస్తానని చెప్పి ఇవాళ 12వేల రూపాయలే ఇస్తామని ముఖ్యమంత్రి చెబుతుంటే రైతులు మండిపడుతున్నరు. కాంగ్రెస్ పార్టీకి పోయేకాలం వచ్చింది. రేవంత్ పాలన చూసి కేసీఆర్‌కు ఓటేసినా బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు ఎన్నికలు పెడితే కేసీఆరే గెలుస్తడు. కేసీఆర్ ఉండంగ రైతులందరికీ మంచిగా రైతుబంధు ఇచ్చిండు. అందరికీ అన్ని పథకాలు, సౌకర్యాలు కల్పించిండు.
-గాలి చిన గోవిందరెడ్డి, రైతు, బట్టుగూడెం, పెద్దవూర మండలం
కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి లేదు
ఎన్నికల ముందు రైతు భరోసా పథకం కింద ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు పన్నెండు వేలే ఇస్తామనడం మోసం చేయడమే. గత ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధు కన్నా అధికంగా రైతు భరోసా ద్వారా ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి లేదు. అప్పులు చేసి వ్యవసాయానికి పెట్టుబడి పెట్టినం. మా లాంటి రైతులను మోసం చేస్తే తగిన గుణపాఠం తప్పదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకోవాలి.
-కొప్పు శ్రీను, రైతు, గుంజలూరు, చివ్వెంల