ఓ వైపు పెద్ద స్క్రీన్. అందులో స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మరో వైపు ప్రజాప్రతినిధులు, అధికారులు. భువనగిరి అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన. అప్పుడే ఏదో జరిగిపోయిందన్న విధంగా అట్టహాసం. కట్ చేస్తే ఏడాది దాటినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఖిలా అభివృద్ధి ఆమడ దూరంలో నిలిచిపోయింది.
ఏకశిలపై నిర్మితమైన చారిత్రక కట్టడం భువనగిరి కోట. ఎన్నో పోరాటాలకు, చరిత్రకు సజీవ సాక్ష్యం. ఇది 147 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ కొండ దక్షిణం నుంచి చూస్తే తాబేలులా, పడమర నుంచి చూస్తే కూర్చున్న ఏనుగులా కనిపిస్తుంది. కొండపైకి వెళ్లేందుకు ఆగ్నేయ, నైరుతి దిశల నుంచి మార్గాలు ఉన్నాయి. హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతో పర్యాటకులను ఆకర్షిస్తున్నది. సెలవు దినాల్లో ట్రెక్కింగ్ నడుస్తున్నది.
భువనగిరి ఖిలాను అభివృద్ధి చేస్తే ఎన్నో ఆధునిక హంగులు, సొబగులు రూపుదిద్దుకోనున్నాయి. మొదటి దఫాలో రోప్‌వే, బేస్ క్యాంప్ సమీపంలో ఫుడ్ కోర్ట్స్, తదితర వసతులు కల్పించాలని నిర్ణయించారు. పునరుద్ధరణలో భాగంగా అడ్వెంచర్ అనుభూతులు పొందేలా ఖిలాను అభివృద్ధి చేయనున్నారు. ఖిలాపై నీటి కొలను పునరుద్ధరించనున్నారు. రాప్పెలింగ్, రాక్ ైక్లెంబింగ్, హైకింగ్, వాల్ ైక్లెంబింగ్, పెయింట్ బాల్, ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్, లిఫ్ట్ స్కైవాక్, ఓవర్‌నైట్ క్యాంపింగ్, మూన్లైట్ డిన్నర్ సదుపాయాలు కల్పించనున్నారు. ఖిలాపై ఉన్న జైలును ఇంటగ్రేటేషన్ సెంటర్‌గా మార్చనున్నారు. ఫోర్ట్ ఏరియాను అభివృద్ధి చేయడంతోపాటు రెస్టారెంట్‌గా తీర్చిదిద్దనున్నారు. ఇప్పుడున్న మెట్లను రెనొవేట్ చేయనున్నారు. గుట్టపై స్కల్పర్ గార్డెన్, రాక్ గార్డెన్, రోప్‌వే స్టేషన్, పార్కింగ్ ఏరియా, ఫుడ్ ప్లాజా, కన్వెన్షన్ సెంటర్ నిర్మించనున్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి రోప్‌వేను భువనగిరి ఖిలా పైకి ఏర్పాటు చేస్తుండటం, ఇప్పటికే యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం, తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధి చెందుతున్న స్వర్ణగిరి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్న నేపథ్యంలో అభివృద్ధి చెందిన భువనగిరి ఖిలాపైకి కూడా పర్యాటకుల రద్దీ పెరిగే అవకాశం ఉంది.
గతేడాది మార్చి 6వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ఖిలా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. భువనగిరి కలెక్టరేట్లో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రధాని శంకుస్థాపన చేసి ఏడాది దాటినా ఇంకా పనులు ఊపందుకోలేదు. అధికారులు పట్టించుకోకపోవడంతోనే పనులు ముందుకు సాగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకొని త్వరగా పనులు పూర్తి చేయాలని భువనగిరి ప్రజలు కోరుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ 2.0 పథకంలో భాగంగా భువనగిరి ఖిలాను ఎంపిక చేసింది. ఖిలాను రూ.118 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. మొత్తం నాలుగు దశల్లో పనులు చేపట్టనుంది. ఇందుకోసం తొలి విడుతలో భాగంగా రూ.69 కోట్లు కూడా మంజూరు చేసింది. రూ.10.73 కోట్లతో రోడ్ల అభివృద్ధి, పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేస్తారు. రూ. 6.07 కోట్లతో ఎంట్రెన్స్ ప్లాజాను అప్‌గ్రేడ్ చేయడంతోపాటు సైట్ ఇంప్రూవ్మెంట్, పర్యాటక వసతులు కల్పించనున్నారు. రూ.4.30 కోట్లతో వారసత్వ కట్టడాల నిర్మాణ పనులు, రూ.12.18 కోట్లతో సౌండ్ అండ్ లైట్ షో, వసతుల కల్పనకు సుమారు రూ. 3 కోట్లు, ఐటీ ఇంటర్వేషన్కు రూ. 3.72 కోట్లు ఖర్చు చేయనున్నారు. రోప్ వే నిర్మాణానికి రూ.15.19 కోట్లు వెచ్చించనున్నారు. ఎల్అండ్టీ సంస్థ ప్రతినిధులు పలుమార్లు భువనగిరి కోటను సందర్శించి అధ్యయనం చేసి డీపీఆర్‌ను రూపొందించారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక సంస్థ లిమిటెడ్ ఆధ్వర్యంలో పనులకు శ్రీకారం చుట్టారు. రోప్ వే కోసం టెండర్ల ప్రక్రియ పూర్తయింది. భూ సేకరణ ఇబ్బందులు తొలగినట్లు తెలుస్తున్నది.