తిరుమలగిరి : తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం చింతలకుంట తండాలో భారీ వర్షాలకు 8 ఇండ్ల పైకప్పులు కూలాయి. ఆయా కుటుంబాలు సర్వం కోల్పోవడంతో అధికారులు స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆశ్రయం కల్పించారు. ఆ తర్వాత అటువైపు చూసినవారే లేరు. కనీసం భోజన వసతి కూడా కల్పించకపోవడంతో బాధితులు తిరిగి తమ ఇండ్ల నుంచే గ్యాస్ సిలిండర్లు, స్టవ్ తెచ్చుకుని వంట చేసుకున్నారు.
మాజీ సర్పంచ్ రవినాయక్ తాగునీటి సౌకర్యం కల్పించారు. సోమవారం పాఠశాలకు సెలవు ఉండడంతో ఇబ్బంది లేదు. మంగళవారం పాఠశాల తెరిస్తే తమ పరిస్థితి ఏంటని బాధితులు ఆవేదన చెందుతున్నారు. పునరావాస కేంద్రంలో వదిలేసిన ప్రభుత్వం ఒక్క పూట భోజనం కూడా అందించలేకపోడం బాధగా ఉందని వాపోయారు. ఈ విషయమై గ్రామ కార్యదర్శిని వివరణ కోరగా.. మంగళవారం వాన పడితే 4 కుటుంబాలను గ్రామపంచాయతీ భవనానికి తరలించి, మిగిలిన వారిని స్కూల్లోనే సర్దుతామని చెప్పుకొచ్చారు.
ఇంటిల్లిపాది రోడ్డున పడ్డం
భారీ వానకు మా ఇల్లు కుప్పుకూలింది. బియ్యం, పప్పు, ఉప్పుతోపాటు వస్తువులన్నీ వరద పాలైనయి. ఇంటిల్లిపాది రోడ్డున పడి దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. చేసుకొని బతికేటోళ్లం. మళ్లీ ఇల్లు కట్టుకునే తాహతు లేదు.ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి.
-షేక్ కరీమా, మాతానగర్, కోదాడ
మా ఊరి మొహం చూసిన అధికారి లేరు
భారీ వర్షాలతో ఊళ్లో చాలా ఇండ్లలోకి నీరు చేరాయి. నిత్యావసర సరుకులు కొట్టుకుపోయి అనేకమంది అల్లాడుతున్నారు. కరెంట్ స్తంభాలు కూలాయి. పంటలు నేలకు పడ్డాయి. రైతుల మోటార్లు వరదలో కొట్టుకుపోయాయి. ఎమ్మెల్యే వచ్చే వరకూ ఒక్క అధికారి అయినా వచ్చిన పాపన పోలేదు. ఇప్పటికైనా గ్రామంలో పర్యటించి నష్టం అంచనా వేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి.
-శెట్టి సురేశ్నాయుడు, కూచిపూడి మాజీ సర్పంచ్, కోదాడ మండలం